రాష్ట్రపతికి వశిష్ట.. మరి చంద్రబాబుకు..?

Update: 2015-12-25 04:39 GMT
కేసీఆర్ వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సంబంధించి బోలెడన్ని విశేషాలున్నాయి. నిజానికి ఇంత పెద్ద కార్యక్రమం వ్యక్తుల వల్ల సాధ్యం కాదనే చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా.. ఏదైనా అనుకుంటే పూర్తి చేయాలన్న మొండితనం.. పట్టుదలతో పాటు.. కార్యక్రమం ఏదైనా ‘‘భారీ’’తనాన్ని ఇష్టపడే కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న యాగం నభూతో అన్నట్లుగా సాగుతోంది.

యాగం నిర్వహిస్తున్న ప్రాంగణంలో వీవీఐపీలు వచ్చినప్పుడు.. వారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కుటీరాలను ఏర్పాటు చేశారు. పేరుకు కుటీరాలే కానీ.. అత్యాధునిక వసతులన్నీ అందులో ఏర్పాటు చేశారు. ఎందుకంటే.. ఆ కుటీరాల్లో బస చేసేది రాష్ట్రపతి.. ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీలు. ఈ కుటీరాలకు పెట్టిన పేర్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ప్రఖ్యాత రుషులు.. మునుల పేర్లను ఈ కుటీరాలకు పేర్లుగా పెట్టారు. యాగశాలకు దగ్గర్లో నిర్మించిన ఈ కుటీరాలకు పెట్టిన పేర్లు చూస్తే.. వశిష్ట.. విశ్వామిత్ర.. రుష్యశృంగుడు.. గౌతమి.. కశ్యప.. భరద్వాజ లాంటి పేర్లతో ఏర్పాటు చేశారు.

యాగానికి అతిధిగా.. చివరి రోజున రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ కాసేపు బస చేయనున్నారు. ఆయన విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా.. వశిష్ట కుటీరాన్ని రాష్ట్రపతికి కేటాయించారు. ఇందుకోసం ఈ కుటీరంలో భారీగా ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే.. యాగం చివరి రోజున హాజరు కానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ కుటీరాన్ని కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ప్రణబ్ కు కేటాయిస్తున్న కేసీఆర్.. బాబుకు ఏ కుటీరాన్ని కేటాయిస్తున్నారన్న విషయం ఇంకా బయటకు రాలేదు.
Tags:    

Similar News