గసగసాల పంట సాగు చేసే రైతు అరెస్ట్ వెలుగులోకి సంచలన విషయాలు !

Update: 2021-03-20 13:30 GMT
గసగసాలు..ఈ పంట నిషేధిత పంట. తెలిసినవారి మాటలు నమ్మి.. భారీగా డబ్బు సంపాదించవచ్చని అత్యాశకు పోయి నిషేధిత పంటను సాగుచేసిన ఓ రైతును రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి నిషేధిత 400 కేజీల గసగసాలును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలని సీపీ మహేశ్‌ భగవత్‌ కేసు వివరాలు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే .. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కటాలపల్లి గ్రామానికి చెందిన దండుపల్లి చెన్నకేశవులు వలస వచ్చి  20ఏళ్ల క్రితం భార్య, పిల్లలతో హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. షాద్‌ నగర్‌, తుక్కుగూడ, కందుకూరుతో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జామ, మామిడి తోటలను లీజుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. అందులో భాగంగా కందుకూరు మండల పరిధిలోని లేమూరు గ్రామంలో బుచ్చిరెడ్డికి చెందిన 20 ఎకరాల జామ, మామిడి తోటను లీజుకు తీసుకోగా అందులో లాభం రాలేదు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చౌడిపల్లి మండలం, గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన దిమ్మిర్‌ వెంకటరమణ పరిచయం అయ్యాడు. మీ పొలంలో గసగసాల పంట వేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవ్చని వెంకటరమణ చెప్పాడు. దానికి కావాల్సిన విత్తనాలను అందించాడు. రూ.5 వేలకు కేజీ చొప్పున గసగసాలను కొంటానని చెన్నకేశవులతో వెంకటరమణ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.  

ఎక్కువగా డబ్బు వస్తుందని ఆశకు పోయిన చెన్నకేశవులు, లీజుకు తీసుకున్న బుచ్చిరెడ్డికి చెందిన రెండు ఎకరాల స్థలంలో పంటను వేశాడు. పంట పండింది. దాదాపు 400 కేజీల గసగసాలును చెన్నకేశవులు సిద్ధంగా ఉంచాడు. వీటిని విక్రయిస్తే రూ.20 లక్షలు వస్తాయని భావించాడు. అయితే , ఆలోపే రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. చెన్నకేశవులుని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 400 కేజీల గసగసాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను అందించిన వెంకటరమణను మార్చి 16న చిత్తూరు జిల్లా మదనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని పీటీ వారెంట్‌ మీద తీసుకొచ్చి, విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గసగసాల పంటను నిషేధించినప్పటికీ తెలంగాణలో మాత్రం పెద్ద మొత్తంలో పంటలు వేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గసగసాలు పంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఓపీఎం   తయారీకి అవసరమయ్యే ముడిసరుకు గసగసాలు. ఇప్పుడు తెలంగాణలో బాగా పండిస్తున్నారు. ఒక్క గ్రాము గసగసాల కాయలతో మార్ఫిన్ తయారవుతుంది. దానికి మరికొంత ప్రత్యేక రసాయన పదార్థం జతచేస్తే హెరాయిన్ తయారవుతుంది. ఈ హెరాయిన్.. డ్రగ్ మాఫియాలో కోట్ల రూపాయల విలువ చేస్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మెడిసిన్ కోసం గసగసాల కాయలను వినియోగిస్తారు. అదీ అక్కడి ప్రభుత్వం కొన్ని నెలల వరకే అనుమతి ఇస్తుంది. ఇక్కడ మాత్రం గసగసాల పంటపై నిషేధం ఉంది.
Tags:    

Similar News