ప్రధాని ప్రకటనకే దిక్కులేదు కదా.. జైట్లీ జీ!

Update: 2016-09-09 04:31 GMT
ప్రత్యేక హోదా పోయింది.. కాదుకాదు.. పోగొట్టేశారు. అంతన్నారు - ఇంతన్నారు ప్యాకేజీ ఇచ్చారు.. అది విభజన చట్టంలోని అంశాలకు తలోపావలా కలిపినట్లే ఉంది. సరేలే ప్రస్తుతానికి, మన చేతకాని తనానికే వచ్చిందే కట్నం అని భావించి.. దానికి చట్టబద్దత కల్పించాలని అడితే.. అబ్బే ఆ అవసరం ఏమీ లేదు అని చెప్పేస్తున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇక్కడే కొత్త అనుమానాలు వస్తున్నాయి. అర్ధరాత్రి మద్దెల దరువేసి ఏపీకి కన్నిరు మిగిల్చిన ప్రత్యేక ప్యాకేజీ పై అయినా కేంద్రానికి స్పష్టత - చెయ్యాలనే ఉద్దేశ్యం.. కచ్చితంగా ఆ హామీలన్నీ ఏపీకి ఇవ్వాలనే తపన ఉన్నాయా? అరుణ్ జైట్లీ మాటలు వింటే ఈ ప్యాకేజీ మాటలపై కూడా కొత్త అనుమానాలు రాకమానవు.

సాక్ష్యాత్తూ పార్లమెంటులో పెద్దలందరి ముందు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన "ప్రత్యేక హోదా" హామీకే దిక్కులేదు. పైగా.. అది ఏమాత్రం సాధ్యం కాదని చావుకబురు చల్లగా చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అయితే ఇక్కడే అసలు అనుమానం వస్తుంది. రాజ్యసభలో దేశ ప్రధాని చెప్పిన విషయానికే దిక్కూ మొక్కూ లేనప్పుడు, ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు కేంద్రమంత్రులు చెప్పిన దానికి ఏమి విలువ ఉంటుంది, ఏ చట్టబద్దత ఉంటుంది. రేపటి రోజున కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయ్యి.. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా మేం చేయలేకపోయాం.. అని మరోసారి వంచిస్తే.. చేయగలిగింది ఏముంటుంది? అదే కనుగ చట్టబద్దత ఉంటే.. కొంతలో కొంత బెటర్ కదా.

ఈ విషయాలనే మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని తేల్చేశారు. నమ్ముట నీవంతంతే.. నమ్మువానికి సమస్థమూ సాధ్యము అనే స్థాయిలో మాట్లాడి.. మమా అనిపించేశారు. ఈ లెక్క చూసుకుంటే.. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన "ప్రత్యేక ప్యాకేజీ" పై నమ్మకం అనుమానమే! ఈ విషయంపై... ఇప్పటికే ఈ హామీలన్నీ చట్టంలో ఉన్నవే కాబట్టి దానికి మరలా చట్టబద్దత కల్పించాలా? అని అంటున్నారు జైట్లీ. అంటే.. ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటించినవి నాడు కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టినవే తప్ప, నేడు "ప్రత్యేకం"గా ఇస్తున్నవేమీ లేవన్నమాటేగా! ఏమిటో ఈ కొత్త కొత్త సందేహాలు ఏపీ ప్రజలకు!!
Tags:    

Similar News