ప్ర‌త్యేక హోదా లేదు..ప్యాకేజీ లేదు

Update: 2015-08-25 12:08 GMT
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆశించిన ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ విష‌యంలో పూర్తి నిరాశే ఎదురైంది. మంగళవారం పీఎం మోడీతో స‌మావేశ‌మ‌య్యాక  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడారు. విభ‌జ‌న చ‌ట్టంలో లేక‌పోయినా మన్మోహ‌న్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు ఏపీకి ఏం ఇవ్వాలా అని ప్ర‌త్యామ్యాయ మార్గాలు ఆలోచిస్తున్న‌ట్టు జైట్లీ చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా లేక‌పోయినా..ఇవ్వాల్సిన ప్ర‌యోజ‌నాల‌న్ని ఇస్తామ‌ని ప‌రోక్షంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌న్న చావు క‌బురును ఆయ‌న చ‌ల్ల‌గా చెప్పారు. ఏపీ స‌మ‌స్య‌ల‌న్ని త‌మ‌కు తెలుస‌ని...ప్రత్యేక హోదా అన్నా, ప్రత్యేక సాయం అన్నా దాని మీనింగ్ డ‌బ్బే క‌దా.... అది ఏదోలా ఇస్తాం అని ముక్తాయించారు.

పారిశ్రామిక అభివృద్ధి కోసం రాయితీలు ఇవ్వ‌మ‌ని ఏపీ ప్ర‌భుత్వం అడిగింద‌ని చెప్పిన జైట్లీ దానిమీద కూడా కేంద్రం ఏం చేస్తుందో చెప్ప‌కుండా దాట‌వేశారు. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికే కొన్ని నిధులు ఇచ్చామ‌ని..ద‌స‌రా రోజున రాజ‌ధాని నిర్మాణం ప్రారంభిస్తామ‌ని చెప్పారు. అలాగే ఏపీలో వెన‌క బ‌డిన ఉత్త‌రాంధ్ర‌లోని మూడు, రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌కు ప్ర‌త్యేక సాయం చేసింద‌న్నారు. ఏపీలో ఇప్ప‌టికే ప‌లు జాతీయ సంస్థ‌ల‌కు శంకుస్థాప‌న‌లు చేశామ‌ని..వాటిని త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. విభజన చట్టంలోని హామీల అమలుకు రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేయాలని నీతి ఆయోగ్‌ ను ఆదేశించినట్లు జైట్లీ వెల్లడించారు.

ఏపీకి కొంత డ‌బ్బు ఇస్తామ‌ని చెప్పిన జైట్లీ అది కూడా ఎంతో చెప్ప‌కుండా ...చాలా ఎక్క‌వే ఇస్తామ‌ని చెప్పారు. ప్రత్యేక హోదాలో ఉన్న ప్రయోజనాలన్నీ అందజేస్తామని ఆయన సష్టం చేశారు. ఏపీని ఇతర రాష్ర్టాలతో పోల్చలేమని, బీహార్‌ వేరు.. ఏపీ వేర‌ని..ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొంద‌డం ఏపీ హ‌క్క‌ని తెలిపారు. నీతి అయోగ్‌ సిఫార్సుల మేరకే ఏపీకి ఆర్థిక సాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఓవ‌రాల్‌ గా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఏపీకి రిక్త‌హ‌స్తాన్ని మిగిల్చింది. అటు ప్ర‌త్యేక హోదా..ఇటు ప్యాకేజీ రెండు పాయే.
Tags:    

Similar News