`ప్యాడ్ మ్యాన్`....అక్షయ్ కుమార్ - రాధికా ఆప్టే జంటగా నటించిన ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. `టాయిలెట్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న అక్షయ్ నటించిన మరో `సామాజిక` చిత్రం `ప్యాడ్ మ్యాన్`పై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్యాడ్ మ్యాన్ పాత్రలో అక్షయ్ కుమార్ జీవించారని టాక్ వస్తోంది. అయితే, మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యంలో అసలు సిసలు `ప్యాడ్ మ్యాన్` ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి? అతడు ఏ పరిస్థితుల్లో ప‌్యాడ్ మ్యాన్ గా మారాల్సి వచ్చింది? అన్న విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం సహజం. అందుకే, ఆ రియల్ ప్యాడ్ మ్యాన్ వెనుక ఉన్న రియల్ స్టోరీని పాఠకులకు అందిస్తున్నాం.
అరుణాచలం మురుగనాథమ్....తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో 1962లో జన్మించిన ఓ సాదా సీదా వ్యక్తి. ఆయన తండ్రి ఎస్. అరుణాచలం - తండ్రి వనితలు చేనేత కార్మికులు. మురుగనాథమ్ తండ్రి ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం అతడి తల్లి పొలం పనులకు వెళ్లేది. మురుగనాథన్ 14వ ఏట విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పి కుటుంబ భారాన్ని మోసేందుకు ఫ్యాక్టరీలో టూల్ ఆపరేటర్ గా - వెల్డర్ గా రకరకాల పనులు చేసేవాడు. 1998లో శాంతిని మురుగనాథమ్ వివాహం చేసుకున్నాడు. తన భార్య రుతుక్రమం సమయంలో పాత దుస్తుల ముక్కలు - న్యూస్ పేపర్లను వాడుతోందని గమనించాడు. వాటిని వాడడం అనారోగ్యకరమైన పద్ధతని - వాటికి బదులు షాప్ లో దొరికే శానిటరీ ప్యాడ్ లను వాడాలని తన భార్యకు సూచించాడు. తనతో పాటు ఆ ఇంట్లోని మహిళలు ఖరీదైన శానిటరీ ప్యాడ్ ల కోసం ఖర్చు పెట్టే డబ్బుతో తమ ఇంటి పాల బిల్లు చెల్లించవచ్చని శాంతి బదులిచ్చింది. ఇది కేవలం తన భార్య - చెల్లెళ్ల సమస్య మాత్రమే కాదని....భారత దేశంలో చాలామంది మహిళలు ఇటువంటి పద్ధతులనే అవలంబిస్తున్నారని మురుగనాథమ్ గుర్తించాడు. దీంతో, చౌక ధరకే శానిటరీ ప్యాడ్ లను తానే స్వయంగా తయారు చేయాలని సంకల్పించాడు.
అనుకున్నదే తడవుగా ఓ శానిటరీ ప్యాడ్ ను తయారు చేశాడు. దానిని వాడి సరిగ్గా పనిచేస్తోందో లేదో చెప్పమని తన భార్యకు ఇచ్చాడు. అయితే, గ్రామీణ నేపథ్యంలో పుట్టిపెరిగిన శాంతికి తన భర్త.....రుతుక్రమం(నెలసరి) - శానిటరీ ప్యాడ్ ల గురించి మాట్లాడడమే కాకుండా....ప్యాడ్ ను ఉపయోగించి ఎలా ఉందో చెప్పమని అడగడం నచ్చలేదు. దీంతో, ఆమె అతడికి సమాధానమివ్వలేదు. తన చెల్లెళ్ల నుంచి కూడా మురుగనాథమ్ కు ఇదే సమాధానం ఎదురైంది. అంతేకాదు, మురుగనాథమ్ తల్లి - భార్య - చెల్లెళ్లు అతడితో ముభావంగా ఉండడం మొదలుపెట్టారు. దీంతో, సమీపంలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థినులకు వాటిని ఇచ్చాడు. అయితే, వారు వాటిని వాడిన తర్వాత సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మురుగనాథమ్ కు తన ప్యాడ్ లలో లోపం ఎక్కడుందో అర్థం కాలేదు. దీంతో, మురుగనాథమ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓ వైపు విద్యార్థినులకు ప్యాడ్ లను ఇస్తూనే ....మరోవైపు తానే స్వయంగా ఆ శానిటరీ ప్యాడ్ లను వేసుకొని పరీక్షించాలని కంకణం కట్టుకున్నాడు. ఈ విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శానిటరీ ప్యాడ్ ధరించిన పురుషుడిగా మురుగనాథమ్ చరిత్రపుటలకెక్కాడు.
తాను రూపొందించిన ప్యాడ్ లను స్వయంగా పరీక్షించేందుకు మురుగనాథమ్ అష్టకష్టాలు పడ్డాడు. వధించిన జంతువుల రక్తాన్ని ఓ ప్యాకెట్ లో సేకరించి దానికి ఓ పైపును జత చేసి తాను ధరించిన ప్యాడ్ పై ప్రసరించేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత యథాతథంగా గ్రామంలో తిరుగుతూ తన పనులు చేసుకునేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆ విద్యార్థినులు వినియోగించిన ప్యాడ్ లను సేకరించడం మొదలుపెట్టాడు. తాను వాడే ప్యాడ్ లతో పాటు ఆ ప్యాడ్ లపై పరీక్షలు జరిపాడు. ఈ క్రమంలో గ్రామస్థులకు ఆ విషయం తెలిసిపోవడంతో అతడు మానసిక వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడని....అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని భావించి అతడిపై ఉన్మాది అనే ముద్ర వేశారు. గ్రామస్థులంతా దాదాపుగా మురుగనాథమ్ ను వెలివేసినట్లుగా ప్రవర్తించేవారు. దాంతోపాటు ....ఆ విద్యార్థినులతో మురుగనాథమ్ కు ఏదో సంబంధం ఉందని శాంతి అనుమానించడం ప్రారంభించింది. దీంతో, శాంతితో పాటు మురుగనాథమ్ తల్లి అతడిని విడిచి వెళ్లిపోయారు. దీంతో, మురుగనాథమ్ ఒంటరివాడైపోయాడు. ఓ పక్క తన పనులు చేసుకుంటూ....సొంతంగా వంట కూడా చేసుకుంటూ....ప్యాడ్ ల పై పట్టువదలని విక్రమార్కుడిలా పరిశోధనలు కొనసాగించాడు.
ఎట్టకేలకు ఖరీదైన శానిటరీ ప్యాడ్ లలో ఉపయోగించే కాటన్ దేని నుంచి సేకరిస్తారో కనిపెట్టాడు. దేవదారు చెట్టు బెరడు గుజ్జులోని నార(సెల్యులోజ్ ఫైబర్)ను ఆ ఖరీదైన ప్యాడ్ లలో వాడుతున్నారని గ్రహించాడు. ద్రవ పదార్థాన్ని ఆ నార శోషించుకోవడం వల్లే ప్యాడ్ లు తమ ఆకారాన్ని కోల్పోకుండా ఉండగలుగుతున్నాయని తెలుసుకున్నాడు. కేవలం 10 పైసలు ఖరీదు చేసే ముడిపదార్థం(నార)తో తయారు చేసిన ప్యాడ్ లను ఆ ముడిపదార్థం రేటుకు 40 రెట్లు అధికంగా అమ్ముతున్నారని గ్రహించాడు. అయితే, ఆ ఖరీదైన ప్యాడ్ లను తయారు చేసే యూనిట్ ధర దాదాపు రూ.3.5 కోట్లు ఉండడంతో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మాత్రమే వాటిని ఉత్పత్తి చేస్తున్నాయని తెలుసుకున్నాడు. దేశంలోని మారుమూల ప్రాంతాలలోని మహిళలకు అతి చౌక ధరకే శానిటరీ ప్యాడ్ లను అందించాలనే ధృఢ సంకల్పంతో దాదాపు నాలుగున్నరేళ్ల పాటు శ్రమించి స్వయంగా ప్రపంచ శ్రేణి ప్యాడ్ తయారీ మిషన్ ను ఇంట్లోనే రూపొందించాడు. రూ.3.5 కోట్ల ఖరీదైన మిషన్ ను కేవలం రూ.65 వేల రూపాయలకే అందుబాటులోకి వచ్చేలా చేశాడు. ఆ మెషీన్ పేటెంట్ ను దక్కించుకున్న మురుగనాథమ్ కు బహుళజాతి కంపెనీలు తమతో భాగస్వామి అయ్యేందుకు కోట్ల రూపాయల ఆఫర్ లు ఇచ్చాయి. అయితే, వాటిని మురుగనాథమ్ తిరస్కరించాడు.
దేశంలోని మారుమూల ప్రాంతాలలో సాధారణ మహిళలు ఈ ప్యాడ్ లను వాడడమే కాకుండా - వాటిని తామే తయారు చేసుకొని స్వయం ఉపాధి కూడా పొందాలనే ఉద్దేశంలో ఆ మెషీన్లను రూ.65 వేలకే విక్రయిస్తున్నాడు. కనీస శిక్షణతో మహిలు స్వయం ఉపాధి పొందుతూ ప్యాడ్ లను తయారు చేసేలా దానిని డిజైన్ చేశాడు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 23 రాష్ట్రాల్లో ఆ మెషీన్లను ఏమాత్రం లాభం ఆశించకుండా అసలు ధర రూ.65 వేలకే మహిళలకు అందించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 106 దేశాలకు వాటిని చేరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాడు. మురుగనాథమ్ అంకితభావాన్ని, కఠోర దీక్షను గుర్తించిన భారత ప్రభుత్వం అతడిని 2016లో పద్మశ్రీ తో సత్కరించింది. 2014కు గాను `ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల`జాబితాలో భారత ప్రధాని మోదీతోపాటు మురుగనాథమ్ కూడా ఎంపికవడం విశేషం. టెడ్ టాల్క్స్ తో పాటు దేశ విదేశాల్లో అనేక చోట్ల ప్రసంగించాడు. దేశవ్యాప్తంగా 7 శాతం ఉన్న శానిటరీ ప్యాడ్ ల వాడకాన్ని 100 శాతానికి చేర్చాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్న మురుగనాథమ్ కు హ్యాట్సాఫ్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెబుదాం!