ఆర్బీఐకి తొలి మహిళా గవర్నరు?

Update: 2016-06-19 07:05 GMT
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నరుగా మరో టెర్ము కొనసాగేందుకు ఇష్టపడని ప్రస్తుత గవర్నరు రఘురామ్ రాజన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది రాజకీయ - ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆర్బీఐ గవర్నర్ పదవి రేసులో ఏడుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఏడుగురి పేర్లు పరిశీలిస్తోంది. వారి నుంచే ఎవరో ఒకరికి అవకాశం వరిస్తుందని తెలుస్తోంది. ఆర్బీఐలోనే కీలక పదవులు నిర్వహిస్తున్నవారు కొందరు కాగా ఇంకొందరు ఇతర బ్యాంకులకు చెందిన పెద్ద పదవుల్లో ఉన్నవారు. ముఖ్యంగా భారత దేశంలోని అతి పెద్ద బ్యాంకయిన  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సీఎండీ అరుంధతి భట్టాచార్య పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

గవర్నర్ గిరీకి పోటీ పడుతున్న వారిలో విజయ్ కేల్కర్ - రాకేష్ మోహన్ - అశోక్ లాహిరి - ఉర్జిత్ పటేల్ - అరుంధతి భట్టాచార్య - సుబిర్ గోకరన్ - అకోశ్ చావ్లా ఉన్నారు. వీరిలో ఉర్జిత్ పటేల్ - అరుంధతీ భట్టాచార్యల్లో ఒకరిని ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పటేల్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ గా వ్యవహరిస్తుండగా భారత్‌ లోనే అతిపెద్దదైన భారతీయ స్టేట్‌ బ్యాంకు సీఎండీగా అరుంధతీ భట్టాచార్య వ్యవహరిస్తున్నారు. మిగతా వారు ఆర్బీఐలో సీనియర్ అధికారులు.

కాగా అరుంధతికి ఈ పదవి దక్కితే ఆర్బీఐ చరిత్రలోనే కొత్త రికార్డు నమోదు కానుంది. 1937లో సర్ ఓస్బర్ను స్మిత్ ఆర్బీఐ తొలి గవర్నరుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రఘురామ్ సహా 23 మంది గవర్నర్లు పనిచేయగా వారిలో మహిళలు ఎవరూ లేరు. అరుంధతి ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపికైతే ఆమే ఆర్బీఐకి తొలి మహిళా గవర్నరు కానున్నారు. ప్రభుత్వం అరుంధతి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ చరిత్రంలో కొత్త శకం ఆరంభం కానుందని వినిపిస్తోంది.
Tags:    

Similar News