గ‌వర్న‌ర్ ఆఫీసులో సీఎం ఆందోళ‌న‌

Update: 2018-06-12 05:14 GMT
కేంద్ర‌ప్ర‌భుత్వానికి - ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ స‌ర్కారుకు మ‌ధ్య నెల‌కొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒక‌రిపై ఒక‌రు అన్న‌ట్లుగా ఇన్నాళ్లుగా చేసుకున్న ఎదురుదాడి ప‌ర్వంలో తాజాగా మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజాల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఎం కేజ్రీవాల్.. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా - ఇద్దరు మంత్రులతో కలిసి అకస్మాత్తుగా బైఠాయించడం ఉత్కంఠకు దారితీసింది. ఎల్జీ కేంద్రం తొత్తుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించగా - ముఖ్యమంత్రి బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఎల్జీ కార్యాలయం ఆరోపించింది.

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో భైఠాయింపున‌కు ముందు, ఆ త‌ర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తాము బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని - ప్రతి ఒక్కరి ఓటు ఆ పార్టీకి అనుకూలంగా పడేలా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కృషిచేస్తుందని  సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ రాష్ట్ర హోదా కల్పించకపోతే బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోరుతూ అసెంబ్లీలో ఏకగీవ్రంగా తీర్మానించామ‌ని తెలిపారు. అంతకుముందు సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2014 లోక్‌ సభ - రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారని, దాన్ని ఎప్పుడు నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. నాటి వైస్రాయ్‌ ల తరహాలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)లను కేంద్రం బలవంతంగా తమపై రుద్దిందని ఆరోపించారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంతో కేజ్రీవాల్ పోల్చారు. మహాత్మాగాంధీ అప్పట్లో బ్రిటిష్ వారిని వెళ్లగొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తే.. తాము ఇప్పుడు ఎల్జీ ఢిల్లీ చోడో ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ``ఢిల్లీలో ప్రజాపరిపాలన లేదు. ఎల్జీ అనే పేరుతో రాచరిక పాలన సాగుతోంది. ఢిల్లీ ప్రజలకు నేటికీ స్వాతంత్య్రం రాలేదు. ఇప్పటికీ రెండో తరగతి ప్రజల్లాగే వారు జీవనం సాగిస్తున్నారు. మనకు స్వాతంత్య్రం రావాలంటే అభినవ వైస్రాయ్ అయిన ఎల్జీని తొలిగించాల్సిందే` అని పేర్కొన్నారు. కేంద్రం తొత్తుగా వ్యవహరిస్తున్న ఎల్జీ - రాష్ట్రంలో పరిపాలన జరుగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎల్జీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జూలై 1న భారీస్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇదిలాఉండ‌గా...ప్రజలకు ఇంటివద్దకే రేషన్ సరుకులు అందించే ప్రక్రియకు ఆమోదం - నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారులపై చర్యలు - అధికారులు వెంటనే సమ్మె విరమించేలా చొరవ చూపడం వంటి మూడు ప్రధాన డిమాండ్లకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై కేజ్రీవాల్ తీవ్ర నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా - మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్ - గోపాల్‌ రాయ్‌ లతో కలిసి ఎల్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, ఎల్జీ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వారు ఆయన కార్యాలయంలోని వెయిటింగ్ రూంలో అకస్మాత్తుగా బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదని వారు తేల్చిచెప్పారు. నాలుగు నెలలుగా పలు దఫాలుగా ఎల్జీని కలిసి విన్నవించినా తమ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే కార్యాలయంలోనే బైఠాయించినట్లు కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి కారణం లేకుండానే కేజ్రీవాల్ అకస్మాత్తుగా నిరసనకు దిగారని, విధులకు గైర్హాజరై ఆందోళనలు చేస్తున్న అధికారులకు సమన్లు జారీచేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి బెదిరింపులు దిగారని ఎల్‌జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ``రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని బెదిరించే ధోరణిలో ముఖ్యమంత్రి వ్యవహరించడం తగదు. అధికారుల సమ్మెపై ఇప్పటికే ఎల్జీ.. సీఎంతో మాట్లాడారు. అధికారుల్లో విశ్వాసచర్యల్ని పాదుకొల్పేలా వ్యవహరించాలని సూచించారు. కానీ, కేజ్రీవాల్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నించినట్లు లేదు. ఎల్జీకి ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండడంతో దానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లిపోయారు. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు`` అని ఆ ప్రకటన వెల్లడించింది.

Tags:    

Similar News