ఢిల్లీ మోడల్ తో గుజరాత్ మోడ‌ల్ కి చెక్... ?

Update: 2022-03-11 02:30 GMT
రాజకీయాల్లో రాణించడానికి విజయం సాధించడానికి స్ట్రాంగ్ నినాదాలు అవసరం. పైగా అవి ఏదో ఉత్తుత్త హామీలుగా మిగిలిపోరాదు. కళ్ల ముందు అభివృద్ధి కనిపించాలి. అపుడే జనాలు నమ్ముతారు. ఇపుడు చూస్తే దేశంలో గుజరాతి మోడల్ అన్నది ప్రాచుర్యం పొందిన పవర్ ఫుల్ నినాదంగా ఉంటూ వచ్చింది. ముమ్మారు గుజరాత్ సీఎం గా మోడీ చేసిన అభివృద్ధిని మెచ్చే జనాలు 2014లో ఆయనకు పట్టం కట్టారు.  ఇక 2019లో మోడీలో బలమైన నేతను చూసి గెలిపించారు.

అయితే మోడీ ప్రధానిగా ఉన్నతమైన పీఠం అధిరోహించడానికి గుజరాత్ మోడల్ అన్నది చాలా చక్కగా ఉపయోగపడింది. ఒక ముఖ్యమంత్రి నేరుగా సీఎం టూ పీఎం గా మారిన చరిత్ర కూడా కళ్ళ ముందే ఉంది. ఇపుడు దాన్ని అందిపుచ్చుకుని మరో చరిత్ర సృష్టించడానికి ఆప్ పార్టీ రెడీగా ఉందా అంటే నో డౌట్ అంటున్నారు చీపురుకట్ట పార్టీ ఫ్యాన్స్.

ఢిల్లీని ఏడేళ్ళుగా కేజ్రీవాల్ పాలిస్తున్నారు. ఆయన్ని అక్కడ ఓడించడం బీజేపీ వశం కావడంలేదు, మోడీ  మ్యాజిక్ కూడా ఏ కోశానా పనిచేయడంలేదు. దాంతో ఢిల్లీ కా సుల్తాన్ అన్నట్లుగా కేజ్రీ వెలుగు వైభవం అన్ స్టాపబుల్ గా  సాగిపోతోంది. మరి ఆ వెలుగులు పక్కనున్న పంజాబ్ మీద కూడా పడ్డాయి. దాంతో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆ సంపన్న రాష్ట్రం ఇపుడు వచ్చి మరీ ఆప్ ఒడిలో పడింది.

ఢిల్లీ మోడల్ డెవలప్మెంట్ అంటూ కేజ్రీవాల్ చేసిన ప్రచారానికి పంజాబ్ జనాలు దాసోహం అన్నారు. పంజాబ్ పాదాక్రాంతమైంది. ఇంతకీ ఢిల్లీ మోడల్ డెవలప్మెంట్ ఏంటి అంటే టోటల్ బడ్జెట్ లో పాతిక శాతం విద్యకే కేటాయించడం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల వరకూ ఉచితంగా మంచి నీరు, మహిళలకు, విద్యార్ధులకు బస్సులలో ఉచితంగా ప్రయాణ సదుపాయం, అవినీతి రహిత పాలన ఇవన్నీ కూడా ఢిల్లీలో కేజ్రీ పాలనకు మచ్చు తునకలు.

తమకు కూడా అదే మోడల్ కావాలని పంజాబ్ వాసులు గట్టిగా కోరుతున్నారు. దాంతో అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు అని ఆప్ నేతలు చెబుతున్నారు.

దీని మీద కేజ్రీ వాల్ కూడా మాట్లాడుతూ ఢిల్లీ పాలన దేశానికి ఆదర్శంగా ఉందని, భవిష్యత్తులో తమ విజయాలు కేవలం పంజాబ్ తో మాత్రమే ఆగిపోకుండా దేశమంతా విస్తరించాలని ఆకాంక్షించారు. మరి అదే కనుక జరిగితే కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటూ దేశమంతా తిరిగితే ఫస్ట్ దెబ్బ పడేది మోడీ మార్క్ గుజరాత్ మోడల్ కే. మరి దీనికి విరుగుడు ఏంటో కాషాయం పార్టీ వారు ఆలోచించుకోవాల్సిందే.
Tags:    

Similar News