చెంప‌దెబ్బతో మారిన సీన్.. చుట్టూ వాళ్లే!

Update: 2019-05-05 11:26 GMT
ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు ఎదురైన‌న్ని చేదు అనుభ‌వాలు స‌మకాలీన రాజ‌కీయాల్లో మ‌రే పార్టీ అధినేత‌కు ఎదురుకాలేద‌ని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అధినేత‌లు అనుస‌రించే భ‌ద్ర‌త‌కు భిన్న‌మైన ధోర‌ణి ఉత్త‌రాదిలో క‌నిపిస్తుంది. ఇక కేజ్రీవాల్ లాంటోళ్లు వీలైనంత సింఫుల్ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికి.. మామూలు నేత‌ల మాదిరిగా త‌మ ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తుంటారు.

అయితే.. ఇలాంటి వాటితో ప్ర‌త్య‌ర్థి పార్టీల అభిమానుల‌కు అవ‌కాశం ఇచ్చేప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా కేజ్రీవాల్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న వేళ‌.. ఒక వ్య‌క్తి దూసుకొచ్చి.. చెంప‌దెబ్బ కొట్టటం తెలిసిందే. అత‌డ్ని ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులు చిత‌కొట్టినా.. పార్టీ అధినేత‌కు జ‌ర‌గాల్సిన అవ‌మానం జ‌రిగిపోయినట్లే.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీ సీఎం త‌న ప్ర‌చారం స్టైల్ ను పూర్తిగా మార్చేశారు. నిన్న‌టి వ‌ర‌కూ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు త‌న చుట్టూ పోలీసుల‌తో నింపేశారు. నిన్న‌టి వ‌ర‌కూ భ‌ద్ర‌తా ద‌ళాల పాత్ర ప‌రిమితంగా ఉంటే.. ఇప్పుడు చుట్టూ వారు త‌ప్పించి మ‌రింకెవ‌రూ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

శ‌నివారం మోతీ న‌గ‌ర్ లో చోటు చేసుకున్న చేదుఅనుభ‌వం దృష్ట్యా.. తాజాగా భ‌ద్ర‌త‌ను మ‌రింత‌గా పెంచేశారు. సీఎంను చెంప‌దెబ్బ కొట్టిన వైనం ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయ కుట్ర‌గా అభివ‌ర్ణిస్తున్నారు ఆప్ నేత‌లు.

ముఖ్య‌మంత్రి భ‌ద్ర‌త‌ను ప‌ట్టించుకోవ‌టం లేదంటూ ఢిల్లీ పోలీసుల‌పై ధ్వ‌జ‌మెత్తారు. కేజ్రీవాల్ ను చంపేయాల‌నుకుంటున్నారా? అని ఘాటుగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం భ‌ద్ర‌త‌ను భారీగా పెంచేశారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు మామూలువాళ్లు వెళ్లే అవ‌కాశం లేకుండా పోలీసులు ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సీఎం మీద దాడి చేసిన వ్య‌క్తిని సురేశ్ గా గుర్తించారు. అత‌డో చిన్న వ్యాపారి అని.. గ‌తంలో అత‌డిపైన ఎలాంటి నేర చ‌రిత్ర లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఐపీసీ సెక్ష‌న్ 323 కింద అభియోగాలు న‌మోదు చేశారు.


Tags:    

Similar News