మోడీ బ్యాచ్ అనుకున్న‌ట్లే జ‌స్టిస్ జోసెఫ్ ప్ర‌మాణం!

Update: 2018-08-08 05:21 GMT
మోడీ బ్యాచ్ అనుకున్న‌ట్లే జ‌స్టిస్ జోసెఫ్ ప్ర‌మాణం!
  • whatsapp icon
ప‌వ‌ర్ మ‌హిమ ఎలా ఉంటుందో చెప్పే ఉదంతం ఒక‌టి వివాదం రూపంలో  ఈ మ‌ధ్య‌న తెర మీద‌కు రావ‌టం తెలిసిందే. సుప్రీంకోర్జు న్యాయ‌మూర్తులుగా నియ‌మిస్తూ ఇటీవ‌ల కేంద్రం జారీ చేసిన ఉత్త‌ర్వులు పెను సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు తెర తీయ‌టం తెలిసిందే.

ముగ్గురు సుప్రీంజ‌డ్జిల‌ను నియ‌మిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం.. అందులో సీనియ‌ర్ అయిన జ‌స్టిస్ కేఎం జోసెఫ్ ను వ‌రుస క్ర‌మంలో మూడోస్థానంలో ఉంచిన తీరును త‌ప్పు ప‌డుతూ అభ్యంత‌రం వ్య‌క్తమైంది. ఈ వివాదం ఒక కొలిక్కి రాక ముందే కేఎం జోసెఫ్ త‌న ప్ర‌మాణ‌స్వీకారాన్ని పూర్తి చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌ను త‌క్కువ చేసేలా చేసిన కేంద్ర ఉత్త‌ర్వుల‌పై జోసెఫ్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర్వులో పేర్కొన్న వ‌రుస క్ర‌మంపై నెల‌కొన్ని వివాదాన్ని ప‌క్కన పెట్టి.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారాన్ని చేప‌ట్టారు. ఎందుకిలా?  అంటే.. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

కేంద్రం ఇచ్చిన నోటిఫికేష‌న్ లో త‌న సీనియార్టీని ప్ర‌భావితం చేసేలా ఉన్న వ్య‌వ‌హారంలో జ‌స్టిస్ జోసెఫ్ మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. దీనిపై కోలీజియం స‌భ్యులైన జ‌స్టిస్ లోకూర్.. జ‌స్టిస్ కురియ‌న్.. జ‌స్టిస్ సిక్రీలు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంపై చ‌ర్చించుకోవాల‌ని వారు అనుకున్న‌ట్లు తెలిసిందే. సెల‌వులో ఉన్న రంజ‌న్ గోగోయ్ వ‌చ్చాక ఆయ‌న‌తో ఈ విష‌యాన్ని చ‌ర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యిం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

దీంతో.. ఇప్పుడీ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెట్టి..కొత్త‌గా నియామ‌క‌మైన ముగ్గురు న్యాయ‌మూర్తుల్ని కేంద్రం పేర్కొన్న వ‌రుస‌క్ర‌మంలో ప్ర‌మాణ‌స్వీకారం చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో జోసెఫ్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌మాణం చేసిన ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టులో జ‌డ్జీల సంఖ్య పాతిక‌కు చేరుకుంది. మ‌రో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కేంద్రం ఎప్ప‌టికి భ‌ర్తీ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News