అసద్ కు చాలానే ఆశలు ఉన్నాయ్

Update: 2015-12-25 05:06 GMT
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన ఆశల చిట్టాను తాజాగా విప్పాడు. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ నిర్వహించే బహిరంగ సభల్లో చాలా విషయాలు మాట్లాడుతుంటారు. అన్నీ పార్టీలు ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. కాదంటే రాత్రిళ్లు సభలు నిర్వహిస్తుంటాయి. కానీ.. మజ్లిస్ మాత్రం తనకు అడ్డా అయిన హైదరాబాద్ పాతబస్తీలో పొద్దుపోయిన తర్వాత కొన్నిసార్లు.. అర్థరాత్రి వేళల్లో మరికొన్నిసార్లు సభలు నిర్వహిస్తాయి. ఈ సభలో తెల్లవారుజాము వరకూ సాగిపోతూ ఉంటాయి. అర్థరాత్రి వేళ.. అంతంత మైకులు వేసుకొని ఆ సభలు ఏమిటని అడిగే వారు ఉండరు. ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు.

మిలాదున్ నబీ వేడుకల్ని పురస్కరించుకొని మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో ప్రసంగించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన రాజకీయ ఎజెండాను కాసేపు వినిపించారు. అయోధ్యలో రామమందిరం కోసం రాళ్లను తరలించటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ముస్లింలను ఐఎస్ తో ముడి పెట్టొద్దన్నారు. ఐఎస్ విడుదల చేసే వీడియోలు చూసి రెచ్చిపోవద్దని కోరిన ఆయన.. భవిష్యత్తులో ముస్లింలు.. దళితులు లోక్ సభలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారని జోస్యం చెప్పారు.

బీహార్ లో 2020లో జరిగే ఎన్నికల్లో మజ్లిస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఆశా భావాన్ని వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. 2018లో బెంగళూరు కార్పొరేషన్ లో పాగా వేయటం ఖాయమన్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందన్నారు. తాము ఒక్కళ్లమే 80స్థానాల్లో పోటీ చేసి గెలవటం ఖాయమని తేల్చారు. తన ఆశల చిట్టాను విప్పి చెప్పిన అసద్ కు ప్రజలేం బదులిస్తారో చూడాలి. ఎప్పుడో.. ఎక్కడో జరిగే ఎన్నికల్ని కాసేపు పక్కన పెడితే.. గ్రేటర్ ఎన్నికల్లో అసదుద్దీన్ చెబుతున్నట్లు 80 స్థానాల్లో ఆ పార్టీ ఎంతమేర విజయం సాధిస్తుందో చూడాలి.
Tags:    

Similar News