మ‌జ్లిస్‌ కు దిక్కుతోచ‌ని స్థితి

Update: 2016-01-13 06:52 GMT
హైద‌రాబాద్ అంటేనే త‌మ ఇలాకా అనుకునే మ‌జ్లిస్ పార్టీకి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల రూపంలో తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. ఇన్నాళ్లు అధికారపార్టీకి అంట‌కాగి త‌మ పైర‌వీలు చేసుకున్న మ‌జ్లిస్‌కు ఈ ద‌ఫా టీఆర్ ఎస్ అలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. పోనీ సొంతంగా ఓట్లైన సంపాదించుకుందామా అంటే..గ‌తంలో లాగా ఏ అభివృద్ధి చేయ‌క‌పోయినా ఓట్లు వేసే స్థాయిలో ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లు లేరు. విద్యావంతులు ఎక్కువ స్థాయిలో ఉండ‌టంతో మ‌జ్లిస్ ఏం అభివృద్ధి చేసింద‌నే ప్ర‌శ్న వారి నుంచి ఎదుర‌వుతోంది. మ‌రోవైపు తాజాగా తెర‌మీద‌కు వచ్చిన ప‌రిస్థితి మ‌జ్లిస్‌ ను దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డేసింది.

గతంలో కాంగ్రెస్‌ - టీడీపీతో లోపాయకారి పొత్తు పెట్టుకున్న మజ్లిస్‌ పార్టీ డిప్యూటీ మేయర్‌ - మేయర్‌ గా అనేక సంద‌ర్భాల్లో ప‌ద‌వులు తీసుకుంది. కానీ, పాతబస్తీని మాత్రం పట్టించుకోలేదు. ఇంతేకాకుండా మజ్లిస్‌ తరపున ఐదేళ్ల పాటు కార్పొరేటర్లుగా ఉన్న‌వారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేశారు. రోడ్లు - డ్రైనేజీ - మంచినీరు - విద్యుత్‌ తదితర సమస్యలు అధికంగా ఉండే పాతబస్తీలో మజ్లిస్‌ కార్పొరేటర్లుగా పనిచేసిన వారు అసలు పట్టించుకోకుండా బస్తీల్లో ఎవరైన కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటుంటే వారిని బెదిరించి ముక్కుపిండి డబ్బు వసూలు చేయడం, రోడ్లు - డ్రైనేజీల కాంట్రాక్ట్‌ లు దక్కించుకొని డబ్బు సంపాదించుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి మాజీ కార్పొరేటర్ల భార్యలకు గ్రేటర్‌ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చినట్లయితే వారి భర్తలపై ఉన్న వ్యతిరేకతతో సతీమణులు ఓడిపోతారన్న భయం మజ్లిస్‌ పార్టీకి వెంటాడుతోంది.

ఇలా బిక్క‌చ‌చ్చిన ప‌రిస్థితుల్లో ఉంటే...గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రిజర్వేషన్లు ప్రకటించడం, అందులో పాత రీతిలో మజ్లిస్ అనుకూల కోటా లేక‌పోవ‌డంతో ఆ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. మజ్లిస్‌ పార్టీకి బలమున్న 47 డివిజన్లలో కేవలం ఎనిమిది డివిజన్లు పురుషులకు, మిగతా 39 డివిజన్లు మహిళా రిజర్వేషన్‌ కోటాలోకి వెళ్లిపోవడంతో తాజా మాజీలు, పార్టీ పెద్దలు ఆందోళనలో పడ్డారు. మజ్లిస్‌ పార్టీకి అసలు మహిళా కార్యకర్తలే లేరు! ఒకవేళ ఉన్నా మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన వారు కొంత మంది, మిగిలినవారు గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారి భార్యలు మాత్రమే ఉన్నారు. మాజీ మ‌హిళా కార్పొరేట్లు, కార్పొరేటర్లుగా పనిచేసి నేత‌ల భార్యలకు టిక్కెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టాలని మజ్లిస్‌ పార్టీ అనుకున్నా... వారి హయాంలో అభివృద్ధి ఏమీ చేయ‌ని తీరు పట్ల ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేకత ఉన్న నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఓటమి పాలవుతారన్న భయం కూడా పట్టుకుంది.

అయితే ఈ సారి కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం వెతుకుతున్నారు. డబ్బు, ప్రచారం మొత్తం తామే చేసి గెలిపిస్తాం.. మా పార్టీతరపున పోటీ చేయాలని తమకు తెలిసిన వారిని వెంటబెట్టుకొని పార్టీ ముఖ్యనేతలు మహిళా అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. కొన్ని డివిజన్లు బీసీ, ఎస్సీ కోటా కిందికి వెళ్లడంతో ఆయా జాబితాల్లోని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఎలాగూ తమకు టికెట్టు దక్కదని భావించిన మాజీలు దారుసలాంలోని పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.

ఇంకోవైపు పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో 44 డివిజన్లు ఉన్నాయి. ఇందులో మహిళల కేటగిరి (జనరల్‌ - ఎస్సీ - ఎస్టీ - బీసీ) వార్డులను గుర్తించి ఆయా డివిజన్లకు చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ సారి 75 డివిజన్లలో పాగా వేయాలనుకున్న మజ్లిస్‌ పార్టీకి రిజర్వేషన్ల వల్ల గతంలో వచ్చిన 47 డివిజన్లలోనైనా గెలుపు సాధిస్తామా, లేదా అనే భయం పట్టుకుంది.  మొత్తంగా మ‌జ్లిస్ ప‌రిస్థితి దిక్కుతోచ‌ని స్థితిలోనే ప‌డింద‌నేది ఓల్డ్ సిటీ టాక్‌.
Tags:    

Similar News