అస‌దుద్దీన్ యూపీ సీఎం.. యోగీ స‌వాల్‌

Update: 2021-07-04 08:45 GMT
ఉత్త‌ర ప్ర‌దేశ్ లో అప్పుడే ఎన్నిక‌ల‌ రాజ‌కీయం మొద‌లైంది. వ‌చ్చే ఏడాది యూపీ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. పార్టీలు మాత్రం ఇప్ప‌టి నుంచే పోరాటం మొద‌లు పెట్టాయి. గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీకి.. ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులే ఎదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో.. ఓట్ల చీలిక‌పైనే క‌మ‌ల‌నాథులు ఆశ‌లు పెట్టుకున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. దీనికి కొన‌సాగింపా? అన్న‌ట్టుగా ఎంఐఎం చీఫ్ అస‌దుద్ధీన్ యూపీలో వాలిపోయారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఈ సారి ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ విడి విడిగానే పోటీ చేయ‌బోతున్నాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు అస‌దుద్దీన్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. మాయావతి నో చెప్పారు. దీంతో.. ఆ రాష్ట్రంలోని చిన్నా చితకా పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టారు. మొత్తం 9 పార్టీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఈ కూట‌మి క‌లిసి నాలుగు వంద‌ల పైచిలుకు స్థానాలున్న యూపీలో పోటీ చేయ‌బోతున్నాయి. ఇందులో ఎంఐఎం వాటా వంద సీట్లుగా ఉంది.

తాజాగా.. ల‌క్నోలో నిర్వ‌హించిన ఓ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అస‌దుద్దీన్‌.. బీజేపీని ఈ ఎన్నిక‌ల్లో ఓడిస్తామ‌ని, యోగీ రెండోసారి సీఎం కావ‌డం క‌ల అని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి చుక్క‌లే అన్న అస‌దుద్దీన్‌.. బీజేపీకి ద‌మ్ముంటే త‌న స‌వాల్ స్వీక‌రించాల‌ని అన్నారు. అదేవిధంగా.. ఈ తొమ్మిది పార్టీల కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న బీఎస్ ఎం అధినేత ఓం ప్ర‌కాశ్ రాజ్బ‌ర్ మాట్లాడుతూ.. యూపీకి అస‌దుద్దీన్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని, ఆయ‌న కావాల్సింద‌ల్లా యూపీలో ఓటు హ‌క్కు మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చారు.

దీనిపై వెంట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ స్పందించ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ‘‘ఓవైసీ దేశంలోనే ప్ర‌ముఖ నాయ‌కుడు. అలాంటి వ్య‌క్తి స‌వాలు విసిరితే మేం కాద‌న‌గ‌ల‌మా? ఎంఐఎం ఛాలెంజ్ ను బీజేపీ స్వీక‌రిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా మూడు వంద‌ల‌కు పైగా స్థానాల్లో విజ‌యం సాధిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

దేశంలో హిందూ-ముస్లిం రాజకీయాలు ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయో తెలిసిందే. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బీజేపీ.. ముస్లింలకు అసలైన ప్రతినిధి తామేనంటూ చెప్పుకునే ఎంఐఎం నేత‌లు ఎన్నిక‌ల‌కు ఏడాదికి ముందుగా ప‌రస్ప‌రం స‌వాళ్లు చేసుకోవ‌డం స్వీక‌రించుకోవ‌డం గ‌మ‌నిస్తే.. మ‌రోసారి మ‌తం ఎజెండాను ముందుకు తేనున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. అస‌లే.. ఎంఐఎం మీద బ‌ల‌మైన విమ‌ర్శ‌లు ఉన్నాయి. బీజేపీకి ఇదొక బీ టీం అని, ఓట్ల‌ను చీల్చి అంతిమంగా బీజేపీ గెలుపున‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని ఇత‌ర రాజ‌కీయ పార్టీలు బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు చేస్తుంటాయి. ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల ముందు ఈ త‌ర‌హా స‌వాళ్లు చేసుకుంటూ ఉండ‌డంతో.. మ‌రోసారి ఈ విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది.
Tags:    

Similar News