ఇంటి అద్దెలు బాగా త‌గ్గిపోతాయ‌ట‌

Update: 2017-06-27 07:53 GMT
మ‌హాన‌గ‌రాల్లో ఉంటూ అద్దె ఇళ్ల‌లో వేలకువేలు కిరాయిలు భ‌రిస్తున్న వారికి ఓ తీపిక‌బురు. దేశీయ సాఫ్ట్‌ వేర్ - సేవల హబ్‌గా కొనసాగుతున్న ప్రధాన నగరాల్లో గృహాల అద్దె 20 శాతం వరకు తగ్గనుందని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అంచనా వేస్తోంది. జూలై నుంచి ఆరంభంకానున్న వచ్చే మూడేళ్ల‌ కాలంలో ఐటీ రంగంలో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉంటుందన్న అంచనాతో గృహాల అద్దెపై ప్రతికూల ప్రభావం చూపనుంద‌ని జోస్యం చెప్పింది.  ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని అసోచామ్ సర్వేలో వెల్లడైంది.

ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతుండటం, వేతన పెంపు చాలా తక్కువ స్థాయిలో ఉండటంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం మందకొడిగా కొనసాగుతుండటంతో ఇళ్ల‌ అద్దెలు తగ్గడానికి ప్రధాన కారణమని అసోచామ్ విశ్లేషించింది. ప్రస్తుతం అద్దెకు ఉన్నవారు మెరుగైన పరిస్థితులకోసం వేచి చూస్తున్నారని, నెలవారి చెల్లింపులు పెరుగడానికి వారు ఇష్టపడటం లేదని సర్వేలో తెలిపింది. నెలకు రూ.50 వేల కంటే అధికంగా రెంట్ చెల్లిస్తున్న వారిపై అసోచామ్ ఈ సర్వేను నిర్వహించింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బెంగళూరుతో పాటు చెన్నై - హైదరాబాద్‌ లో ఇళ్ల‌ అద్దెలు 10-15 శాతం వరకు తగ్గనుందని పేర్కొంది. పుణెలో మాత్రం 20 శాతం వరకు తగ్గనున్నాయట. దేశరాజధాని ఢిల్లీ పరిసరప్రాంతాల్లో కూడా రెంట్లు 15 శాతం కరెక్షన్‌ కు గురవనున్నాయని వెల్లడించింది.

ఉద్యోగ నియామకాల్లో నిస్తేజం ఉన్నప్పటికీ నాలుగు నుంచి ఐదు పెద్ద నగరాల్లో ఐటీ రంగంలో 40 లక్షల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఐటీ - ఆర్థిక సేవల రంగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నప్పటికీ ఈ రంగానికి చెందిన సిబ్బంది తొందరగా టెంప్ట్ అవుతున్నారని ఆయ‌న విశ్లేషించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News