మరో బాంబు పేల్చబోతున్న వికీ లీక్స్

Update: 2016-08-25 10:08 GMT
అగ్ర రాజ్యం అమెరికాతో అనేక దేశాలకు సంబంధించి లోగుట్టులన్నీ బయటపెట్టి ప్రకంపనలు రేపిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూనియన్ అసాంజ్.. మరో సంచలనానికి తెరతీయబోతున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో.. అధ్యక్ష పదవికి గట్టి పోటీదారుగా ఉన్న హిల్లరీ క్లింటన్ కు సంబందించి కీలకమైన సమాచారం బయటపెట్టబోతున్నట్లు అసాంజ్ చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. నవంబరు 8న ఎన్నికల జరగడానికి ముందే ఈ విషయం వెల్లడిస్తానని.. ఆ విషయం హిల్లరీ ప్రచారానికి సంబంధించినదని.. అధ్యక్ష ఎన్నికలపై ఆ సమాచారం చాలా ప్రభావం చూపొచ్చిన అసాంజ్ చెప్పడం విశేషం.

ఫాక్స్ న్యూస్ శాటిలైట్ ఇంటర్వ్యూలో భాగంగా అసాంజ్ ఈ సంగతి వెల్లడించాడు. తాను వెల్లడించే సమాచారంతో మీడియాలో.. ప్రజల్లో అగ్గి రగులుతుందని అసాంజ్ వ్యాఖ్యానించాడు. తనను ఎంత నిర్బంధం చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తన పనిని తాను వదిలేది లేదని అసాంజ్ మరోసారి స్పష్టం చేశాడు. వివిధ రకాల సంస్థల నుంచి.. కొన్ని ఊహించని కోణాల్లో ఆసక్తికరమైన వార్తల్ని తమ సంస్థ అందించబోతున్నట్లు అసాంజ్ ప్రకటించాడు. 2010లో బయటపడ్డ వికీలీక్స్ పత్రాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాయి. ముఖ్యంగా. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి బయటపెట్టిన సైనిక.. దౌత్య పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. అమెరికా కళ్లు తనపై పడటంతో కొన్నాళ్ల పాటు అండర్ గ్రౌండ్లో ఉన్న అసాంజ్.. దాదాపు ఐదేళ్లుగా ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నాడు. అతను అక్కడి నుంచి బయటకు రాగానే అరెస్టు చేయడానికి అమెరికా.. స్వీడన్ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి.
Tags:    

Similar News