ముగిసిన వాజ్ పేయి అంత్య‌క్రియ‌లు!

Update: 2018-08-17 14:16 GMT

రాజ‌కీయ కురువృద్ధుడు - గొప్ప రాజ‌నీతిజ్ఞుడు - మాజీ ప్రధాని - భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ అంత్యక్రియలు కొద్ది సేప‌టి క్రితం ముగిశాయి. ప్ర‌ధాని మోదీ - బీజేపీ అగ్ర‌నేత‌లు - వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు - విదేశీ నేత‌లు -  బీజేపీ అభిమానులు - సన్నిహితుల కన్నీటి వీడ్కోల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయి అంత్య‌క్రియలు అధికారికంగా ముగిశాయి. త్రివిధ దళాల అధిపతులు - సైనికుల క‌వాతుల మ‌ధ్య వాజ్ పేయి పార్థీవ దేహానికి అంత్య‌క్రియలు జ‌రిగాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో బీజేపీ దిగ్గ‌జం అంతిమ సంస్కారాలను ఆయ‌న కుటుంబ స‌భ్యులు నిర్వహించారు. వాజ్ పేయి దత్తపుత్రిక నమిత....హిందూ సంప్రదాయం ప్ర‌కారం దహన సంస్కారాలు చేసి వాజ్‌పేయి చితికి నిప్పంటించారు. వాజపేయి పార్థీవ దేహంపై కప్పివుంచిన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనవరాలు నిహారిక స్వీక‌రించారు. విజయ ఘాట్ పక్కన 1.5ఎకరాల్లో వాజపేయి మెమోరియల్‌ ను ఏర్పాటు చేయనున్నారు.

ప‌లురురు జాతీయ‌ - అంత‌ర్జాతీయ రాజ‌కీయ ప్ర‌ముఖులు వాజ్ పేయి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. వాజ్ పేయి పార్థీవ దేహంతో పాటు మోదీ - షా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ - దేవేంద్ర ఫడ్నవిస్ .... బీజేపీ ప్ర‌ధాన కార్యాలయం నుంచి కాలిన‌డ‌క‌న నాలుగు కిలోమీట‌ర్లు న‌డిచి స్మృతి స్థ‌ల్ కు చేరుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ - మోదీ - అమిత్ షా - రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - భూటాన్‌ రాజు వాంగ్‌ చుక్‌ - లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ - రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ - త్రివిధ దళాధిపతులు - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ - ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు స్మృతి స్థల్‌ లో మహానేత వాజ్ పేయి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని నివాళులర్పించారు. వాజ్ పేయి పార్థీవ దేహానికి ఆఫ్ఘనిస్తాన్ మాజీ హమీద్ కర్జాయ్ - శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి లక్ష్మణ్ - భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగేల్ వాంగ్‌ చుక్ కూడా నివాళులర్పించారు. వీరితోపాటు, హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - రవిశంకర్‌ ప్రసాద్‌ - ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - నితిన్‌ గడ్కరీ - హర్షవర్ధన్‌ - స్మృతి ఇరానీ - అశోక్‌ గెహ్లాట్‌ - కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం నబీ ఆజాద్‌ - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ - డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా - మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ - ఛత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ - ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ - భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి - తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Tags:    

Similar News