వాజ్‌పేయి ఈ సారి ఓటు వేస్తారా?

Update: 2017-02-18 07:41 GMT
ఐదురాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా అంద‌రి చూపు కీల‌క రాష్ట్రమైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పై ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ రాష్ట్రంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన లక్నో సెంట్రల్ నియోజకవర్గంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ల‌క్నో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ‘ఓటరు నంబర్ 141’ మరోసారి తన ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ ఓటరు ఎవరో కాదు. లోక్‌సభలో వరుసగా అయిదుసార్లు లక్నో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన 92 ఏళ్ల మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి. చివరిసారిగా 2004 లోక్‌ సభ ఎన్నికల్లో వాజపేయి ఓటు వేశారు. ఆయన 2004 ఎన్నికల్లోనే చివరిసారిగా పోటీ చేశారు. ఆ తరువాత వాజపేయి 2007 - 2012ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 - 2014ల్లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారని ఆయన అనుచరుడు శివకుమార్ ఒక చెప్పారు.

'వాజ్‌పేయి గత కొన్నేళ్లుగా వృద్ధాప్యం కారణంగా సంక్రమించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బయటకు కదలలేక పోతున్నారు. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వాజపేయి తన ఓటుహక్కును వినియోగించుకోలేరు.'అని కుమార్ చెప్పారు. లక్నో సెంట్రల్ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ జరుగనుంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వాజపేయి ఓటు వేయవలసి ఉంది. ఆయన ఓటరు ఐడెంటిటి కార్డు నంబర్ ఎక్స్‌ జిఎఫ్0929877. వాజపేయి లక్నో నియోజకవర్గం నుంచి 1991 - 1996 - 1998 - 1999 - 2004 లోక్‌ సభ ఎన్నికల్లో గెలుపొందారు. వాజపేయి ఈసారి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేకపోతున్నారని, అయితే ఆయన ఆశీస్సులు తమకు ఎల్లవేళలా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News