ఎర్రన్నాయుడి ఇంట్లో ముసలం నిజమేనా?

Update: 2017-02-17 07:15 GMT
శ్రీకాకుళం జిల్లాల్లో బాబాయ్-అబ్బాయ్ మధ్య రాజకీయ అధిపత్యానికి తెరలేచింది. ఎర్రన్నాయుడు తనయుడైన ఎంపి రామ్మోహన్‌ నాయుడు రాజకీయ ఎదుగుదలకు బాబాయ్ అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నారని, దివంగత ఎర్రన్నాయుడు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలకు మచ్చ తెస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న ఎర్రన్న కుటుంబం ఇటీవల పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలసి అచ్చెన్న చర్యలపై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబం నుంచి మంత్రి పదవి లేకపోయినా ఫర్వాలేదని, కానీ ఎర్రన్న పేరు ప్రతిష్ఠలకు మచ్చ తెచ్చేందుకు తాము అనుమతించబోమని బాబు వద్ద వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
    
ఎంపీగా ఉన్న రామ్మోహన్‌ నాయుడు జిల్లాలో సిఫారసు చేసిన వివిధ పనులు - బదిలీలను అచ్చెన్నాయుడు అడ్డుకుంటున్నారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేస్తున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచీ వినిపిస్తున్న విషయం తెలిసిందే. యువనేత రామ్మోహన్‌ నాయుడు దూకుడును అచ్చెన్న రాజకీయ అభద్రతగా భావిస్తున్నందుకే జిల్లాలో ఆయనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామ్మోహన్‌ నాయుడు అనుచర వర్గం చాలాకాలం నుంచీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా సైకిల్ యాత్రతో జిల్లాలో పార్టీని కదిలించి, ఎర్రన్నాయుడిని గుర్తు చేసిన రామ్మోహన్‌ నాయుడిని ఎదగనీయకుండా చేస్తున్న ప్రయత్నాలు దివంగత నేత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎర్రన్నాయుడు కుటుంబం చివరకు విధిలేక బాబును కలసి జిల్లాలో పరిస్థితి వివరించినట్లు సమాచారం.
    
అయితే.. ఎంపి రామ్మోహన్‌ నాయుడు మాత్రం తమ మధ్య విభేదాలేవీ లేవని చెబుతున్నారు.  కుటుంబంలో ఎలాంటి రాజకీయ కలహాలు లేవని చెప్పారు. నిమ్మాడ సర్పంచ్‌ కు సంబంధించి చెక్‌ పవర్ అంశం సహా, తామంతా కలిసే చేసుకుంటున్నామని, బాబాయ్‌ తో తనకెలాంటి విభేదాలు లేవని, అసలు తన తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పటివరకూ తమ కుటుంబం చంద్రబాబును కలవలేదని చెబుతున్నారు. మరి నిజమేంటో వారికే తెలియాలి. విభేదాలు నిజమైతే మాత్రం ఉత్తరాంధ్ర టీడీపీలో భారీ కుదుపు తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News