ఈ కొవ్వు మాటలేంది అచ్చెన్నా?

Update: 2016-03-16 03:54 GMT
అధికారం అహంకారాన్ని ఇస్తుంది. అది.. తప్పులు చేసేలా చేస్తుంది. అందుకే పవర్ లో ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అన్నింటికి మించి అధికారంలో ఉన్న వారి మాటల్ని ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. హద్దులు దాటే వారిని వారేమాత్రం ఇష్టపడరు. అధికారం ఆభరణం కావాలే కానీ.. దాన్నో దండంగా మార్చటాన్ని అస్సలు ఇష్టపడరు. అయితే.. ఏపీ అధికారపక్షం అలాంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేనట్లుగా కనిపిస్తుంది. అధికారపక్షంపై విపక్షం చెలరేగిపోతే.. అందుకు రెట్టింపు చెలరేగిపోవటమే సరైన సమాధానంగా భావిస్తున్నట్లుంది.

నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా అన్న ధోరణి తప్పించి.. తెలివిగా దెబ్బ తీసే ధోరణి తెలుగుతమ్ముళ్లలో మిస్ అవుతోంది. ప్రతి ప్రశ్నకు ఆవేశంతో ఊగిపోవటం.. నోటికి వచ్చినట్లు తిట్టేయటం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంతగా రెచ్చిపోవాలా? అన్న భావన కలిగేలా ఏపీ అధికారపక్ష వైఖరి ఉండటం గమనార్హం.

సోమవారం సభలో జరిగిన వ్యవహారాన్నే తీసుకుంటూ.. న్యాయవ్యవస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను డిఫెన్స్ లో పడేసేలా చేశాయి. క్షమాపణ తప్ప మరో మార్గం లేకుండాచేశాయి. ఒకవేళ.. సారీ చెప్పకున్నా..జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసే పరిస్థితి. ఇలాంటి సమయంలో మైకు తీసుకున్న మంత్రి అచ్చెన్న.. న్యాయవ్యవస్థ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదో టంగ్ స్లిప్ అయ్యి చేయలేదని.. ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రస్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో నువ్వు మగాడివైతే లాంటి పదాల్ని వినియోగించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మాట్లాడేందుకు ఒక స్థాయి ఉంటుందని.. ఆ హద్దులు దాటేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయటం ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అచ్చెమ మాట్లాడే వరకూ ఏపీ అధికారపక్షం వైపు మొగ్గిన వారంతా.. అచ్చెమ దూకుడు కారణంగా.. జగన్ ను అంతేసి మాట అంటారా? అన్న భావన కలిగేలా చేయటంతో పాటు.. విపక్ష నేత పట్ల సానుభూతి కలిగేలా చేశాయి. దూకుడుగా వ్యవహరించటం మంచిదే. కానీ.. అందులోనూ వ్యూహం ఉండాలి. టెక్నిక్ గా ఆడటం వదిలేసి.. అడ్డ బ్యాటింగ్ చేయటం ఎంత తప్పో.. అదే తరహా తప్పును చేస్తున్నారు అచ్చెన్నాయుడు. ఆయన తన నోటిని అదుపులో ఉంచుకునేలా చేయాలి. ఒకవేళ ఆయనకు అది చేతకాని పక్షంలో.. ఆయనకు బ్రేకులు వేసే బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News