రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకొంటాన‌న్న మంత్రి

Update: 2016-03-14 16:43 GMT
శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌భ‌లో దుమారం రేపాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నాయంటూ అధికార‌ప‌క్షంల‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చడం తగదని అన్నారు. అనంత‌రం తెలుగుదేశం సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత జగన్ కేవలం అధికార కాంక్షతోనే విపక్షనేత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారని అన్నారు. వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడిన ఆయన విపక్ష సభ్యులే ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. జ‌గ‌న్ నేర చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బొండా ఉమ అన్నారు. ఈ సంద‌ర్భంగా జగన్‌ పై ఉన్న కేసుల వివరాలను ఆయన సభలో వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టాలని ప్రతిపక్ష నేత జగన్‌ అనుకుంటున్నారో సభకు సమాధానం చెప్పాలని బొండా ఉమ కోరారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కూలదోయాలని నిర్ణయించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా వివిధ పథకాలను ఉటంకిస్తూ వాటిని అమలు చేస్తున్నందుకు కూలదోయాలనుకుంటున్నారా అని బోండా ఉమ నిల‌దీశారు. ఇదిలా ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. సోలార్‌ పనుల్లో అక్రమాలు జరిగాయని జగన్‌ నిరూపిస్తే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానని  సవాల్‌ విసిరారు. సోలార్‌ పనుల విషయంలో ఇంత వరకు టెండర్లే పిలవలేదు.. ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జగన్‌కు దమ్మూ ధైర్యం ఉంటే ఆయన చేస్తున్న ఆరోపణలు నిరూపించాలన్నారు.
Tags:    

Similar News