సీపీఐ ఆఫీస్ పై దాడి... చాడ కారు అద్దాలు ధ్వంసం

Update: 2020-09-14 04:30 GMT
భాగ్యనగరి హైదరాబాద్ లో... నగరం నడిబొడ్డున ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ పై ఆదివారం జరిగిన దాడి పెను కలకలమే రేపుతోంది. నగరంలో ఎలైట్ ప్రాంతంగా ఉన్న హిమాయత్ నగర్ లో మగ్ధూంభవన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ భవనంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం కొనసాగుతున్న సంగతీ తెలిసిందే. నిత్యం వామపక్ష భావజాలంతో కూడిన సమాలోచనలు, సీపీఐ పార్టీ కార్యకలాపాలపై సమీక్షలు జరిగే ఈ భవనం నిత్యం లెఫ్టిస్టులతో కళకళలాడుతూనే ఉంటుంది. అంతేనా... ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే సీపీఐ నేతలు కూడా అక్కడే బస చేస్తూ ఉంటారు కూడా. అలాంటిది ఆ భవనంపై ఆదివారం గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు.

ఈ దాడిలో సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డికి చెందిన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతకుమించి ఈ దాడిలో పెద్దగా నష్టమేమీ జరగలేదు గానీ... నిత్యం ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్న సీపీఐ కార్యాలయంపై దాడి జరగడమంటేనే ఆశ్చర్యం కలగక మానదు. అంతేకాకుండా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భవనంపై దాడి జరిగిందంటే... ఎవరో గానీ పక్కా ప్లాన్డ్ గానే దాడికి దిగినట్లుగా తెలుస్తోంది,.

హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగిందన్న విషయం ఒక్కసారిగా నగరంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆదివారం నగరంలోనే ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ హుటాహుటీన అక్కడికి చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. ఇదే విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఏది ఏమైనా సీపీఐ కార్యాలయంపై దాడి జరిగిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
Tags:    

Similar News