కోలుకున్న త‌ల్లి.. అనారోగ్యం పాలైన తండ్రి... ఎంపీ అవినాష్ ప‌రిస్థితేంటి?

Update: 2023-05-26 19:09 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి వ్య‌వ‌హారం మ‌లుపులు తిరుగుతోంది. సీబీఐ విచార‌ణ‌కు వెళ్లేందుకు ఆయ‌న‌కు అడ్డంకులు పెరుగుతున్నాయి. గ‌త శుక్ర‌వార‌మే ఆయ‌న సీబీఐ ముందు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లో ఆయ‌న మాతృమూర్తి శ్రీల‌క్ష్మి అనారోగ్యానికి గురికావ‌డంతో క‌ర్నూలులోని విశ్వ‌భార‌తి ఆసుప‌త్రిలో చేర్పించారు. దాదాపు వారం రోజుల పాటు ఆమె అక్క‌డ చికిత్స తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో కొద్దిగా కోలుకోవ‌డంతో ఆమెను హైద‌రాబాద్‌లోని ఏఐజీఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌రింత మెరుగైన వైద్యం కోస‌మే ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న‌ట్టు ఎంపీ అనుచ‌రులు తెలిపారు. అయితే.. ఆమె ఆరోగ్యం కుదుట ప‌డింద‌ని, ప్రాణా పాయ స్థితి నుంచి కోలుకున్నార‌ని విశ్వ‌భార‌తి ఆసుప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ఇదే వివేకానంద‌రెడ్డి కేసులో అరెస్ట యి.. హైద‌రాబాద్‌లోని చంచ‌ల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్క‌ర‌రెడ్డి అనారోగ్యానికి గుర‌య్యారు.

జైలులో ఉన్న వైఎస్ భాస్క‌ర‌రెడ్డి కి బీపీ పెర‌గ‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య చికిత్స‌ల అనంత‌రం.. ఆయ‌న‌ను తిరిగి జైలుకు త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా చూస్తే.. అవినాష్ రెడ్డి త‌ల్లిదండ్రులు.. ఇద్ద‌రూ కూడా.. అనారోగ్యం బారిన ప‌డ‌డం.. అవినాష్‌రెడ్డి విచార‌ణకు దూరంగా ఉండ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. దీనిపైనే రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. ఈ ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతుందా?  ఆయ‌న‌కు ఎప్పుడు విచార‌ణ‌కు హాజ‌రవుతారు? అనే విష‌యాల‌పై తర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Similar News