ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణకు అవార్డు.. ఇచ్చిందెవరంటే?

Update: 2022-08-26 05:30 GMT
అవార్డులు రావటం మామూలే. కానీ.. కొన్ని అవార్డులు వచ్చిన టైమింగ్ తో వాటికుండే ప్రాధాన్యత మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్న వేళ.. కేంద్రంతో కయ్యం నడుస్తున్న వేళ.. తమ పాలన ఎంత భేషుగ్గా ఉందన్న విషయాన్ని చెప్పే పురస్కారం ఒకటి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా అలాంటి అనుభవమే కేసీఆర్ సర్కారుకు ఎదురైంది. పర్ ఫెక్టు టైమింగ్ అన్నట్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వ్యాపారాన్ని సులభతరం చేయటంలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రముఖ బిజినెస్ మ్యాగ్ జైన్ సంస్థ ఒకటి అవార్డును ప్రకటించి.. దాని ప్రధానం తాజాగా జరిగింది.

డిజిటెక్ కాంక్లేవ్ 2022లో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన పురస్కారాన్ని అందుకోవటం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీ రావటమే కాదు.. సదరు పురస్కారాన్ని సొంతం చేసుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రషిని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిన వైనం చూసినప్పుడు అల్లాటప్పాగా ఇచ్చింది కాదని.. ఎంతోరీసెర్చి చేసిన తర్వాత ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారు విడుదల చేసిన పలు నివేదికలతో పాటు క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశోధన.. అధ్యయనం ఆధారంగా తెలంగాణను తాజా పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న సంస్కరణలతో పాటు.. 'మీ సేవ' పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవల్ని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డు కోసం ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ పురస్కారాన్ని అందుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  రాష్ట్రంలో ఉన్న 'మీసేవ' కార్యకలాపాల్లో తీసుకొచ్చిన మార్పుల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలతో పాటు.. టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉన్న‌ద‌న్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాజా పురస్కారం గుర్తింపుగా అభివర్ణించారు. ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చిన ఈ పురస్కారం కేసీఆర్ సర్కారు ఇమేజ్ ను పెంచుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News