ఇసుక అంత పనిచేసిందా?

Update: 2015-11-06 06:57 GMT
''ఇంతవరకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఓ ఎత్తు.. ఇసుక పాలసీ మరో ఎత్తు.. అవన్నీ విజయవంతమై ప్రభుత్వానికి పేరుతెచ్చాయి. ఇదొక్కటే ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేసింది'' అని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చాలా ఫీలవుతున్నారు. తమ ప్రభుత్వానికి ఇసుక చాలా చెడ్డపేరు తెచ్చిందని ఆయన బాధపడుతున్నారు.  మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించే లక్ష్యంతో అప్పగించిన ఇసుక ర్యాంప్‌ ల వల్ల సంఘాలకు లాభం కలగకపోగా కొందరు దళారులు - మధ్యవర్తులు - పైరవీ కారులకు మాత్రం ఇసుక కాసుల వర్షం కురిపించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్నే ఈ విధానం నీరు గార్చేసిందన్నారు. త్వరలోనే ఇసుక విధానంలో మార్పులు చేస్తామని మంత్రి చెప్తున్నారు.

ర్యాంప్‌ లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచన చేస్తున్నా మని..  ఇసుక ధరను కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుందని తెలిపారు. అయితే, ప్రయివేటు వాళ్ల చేతుల్లోనే ఉన్న ఇసుకను మహిళా సంఘాలకు ఇచ్చి... ఇసుకకు కరువొచ్చేలా చేసి కాసులు సంపాదించకున్నది రాజకీయనాయకులేనన్న మాట మాత్రం అయ్యన్న చెప్పడం లేదు. పేరుకు మహిళా సంఘాలకే అప్పగించినా ప్రతిచోటా టీడీపీ - వైసీపీ - కాంగ్రెస్ అన్న తేడా లేకుండా ఎవరి పరిధిలో ఉన్న ఇసుక రీచుల్లో వారు దందా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారు. ఇసుక వల్ల చెడ్డపేరు వచ్చింది... దళారుల రాజ్యంగా మారిందంటున్న అయ్యన్న అందుకు రాజకీయ నేతలే కారణమని మాత్రం ఎందుకు చెప్పడం లేదో. ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు కూడా ఇసుక వల్ల చెడ్డపేరు వచ్చిందన్న ఆయన మాటలు మాత్రం నిజం..  ఇందుకు టీడీపీ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ కారణమే.
Tags:    

Similar News