బాబు ఊతపదాలపై బాబూ మోహన్ కామెంట్!

Update: 2016-09-02 10:21 GMT
ఓటుకు నోటులోను ఏపీ సీఎం చంద్రబాబు స్టే తో గట్టెక్కారు.. ఇది ఏమాత్రం కొత్త విషయం కాదు, ముందుగా ఊహించిందే అనేది పలువురి మాటగా ఉంటే.. విచారణకు హాజరు కాకుండా ఇలా దొడ్డిదారిన తప్పించుకోవడమేంటని ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైరవుతున్నారు. స్టే తెచ్చుకుంటే కోర్టు విషయంలో సరే కానీ.. ప్రజల ముందు మాత్రం ఎప్పుడో దోషిగా నిలబడ్డారనేది వారి వాదన. అయితే ఇంతకూ ఈ కేసు తొలినాళ్లతో నానా హడావిడీ చేసిన తెలంగాణ అధికారపక్షం మాత్రం ఈ మధ్యకాలంలో మౌనాన్నే తమ బాషగా చేసుకుని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పుకొస్తున్నారు.

ఈ సంగతులు ఇలా ఉంటే.. ఓటుకు నోటు విషయమై తెరాస ఎమ్మెల్యే, సినీ నటుడు బాబుమోహన్ స్పందించి..."సుదీర్ఘ కాలం చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవం రీత్యా చెబుతున్నాను.. అది కచ్చితంగా చంద్రబాబు గొంతే" అని తేల్చి చెప్పేశారు. దీనికి బాబు ఊతపదాలుగా కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు ఈయన. నోటుకు ఓటు కేసులో బాగా పాపులర్ అయిన ఆడియో టేపుల్లోని మాటలు.. "డోన్ట్ బాదర్", "ఐయామ్ విత్ యూ" లు చంద్రబాబు నోటివెంట ఎపుడూ వస్తూనే ఉంటాయని, అవి బాబుకు ఊతపదాలని.. ఆడియో టేపుల్లో చంద్రబాబు గొంతు అంత స్పష్టంగా వినిపిస్తుంటే.. ఇక తాను ప్రత్యేకంగా చెప్పేదేముందని అంటున్నారు బాబూ మోహన్.

ఈ సందర్భంగా తాను తెరాసలోకి వెళ్లడానికి గల కారణాలను కూడా చెప్పిన ఆయన... కొందరు వెధవల మాటలు విని చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదని, ఆ కారణం వల్లే పార్టీ మారాల్సి వచ్చింది తప్ప తాను "గోపీ" ని కాదని చెప్పుకొచ్చారు. టీడీపీ తనకు టిక్కెట్టు ఇవ్వలేదని తెలిసి, ఫోన్ చేసిన కేసీఆర్.. టీఆర్ ఎస్ లోకి వచ్చేయమని ఆహ్వానించారని, ఆ పార్టీలో ప్రస్తుతం తనకు తగిన గౌరవం లభిస్తుందని అన్నారు.
Tags:    

Similar News