బాబు హైద‌రాబాద్‌కు...నేత‌లు బీజేపీలోకి

Update: 2019-11-04 09:21 GMT
తానొక‌టి త‌లిస్తే...దైవం మొర‌క‌టి త‌లిచింది అన్న‌ట్లుగా ఉంది ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి. తెలంగాణలో పార్టీ కొనసాగించడంపై సీరియస్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు భావించి...ప్రతీ శ‌నివారం హైదరాబాద్‌కు రావడం, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ నాయకులకు, పార్టీ వర్గాలకు అందుబాటులో ఉండ‌టమ‌నే ప్ర‌ణాళిక‌తో సాగుతుంటే...తెలుగుదేశం నేత‌లు మాత్రం త‌మ దారి తాము చూసుకుంటామ‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే..పుట్టి మునిగేలా ప‌క్క‌పార్టీలోకి నేత‌లు జంప‌వుతున్నారు. తాజాగా ఇద్ద‌రు నేత‌లు బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే...దీనికి నిద‌ర్శ‌నం.

తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కూడా అయిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్న‌పూర్ణ‌మ్మ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బాల్కొండ ఇంచార్జీగా ఉన్న‌ త‌న త‌న‌యుడితో పాటు ఆమె పార్టీకి, ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి బైబై చెప్పారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ఆద‌ర‌ణ లేద‌ని... ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల ఆకాంక్ష‌ల‌కు భిన్నంగా తాను వ్య‌వ‌హ‌రించ‌లేన‌ని పేర్కొంటూ...ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఇంకో ముఖ్య‌నేత అయిన‌ మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరేందుకు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ జ‌రిపిన చ‌ర్చ‌ల‌కు సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి... బీజేపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు.

ఇలా బాబు గారు ఏపీ రాజ‌కీయాల కంటే తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టి పెడ‌తాన‌ని అంటుంటే...స‌మ‌యం ఇస్తుంటే..నేత‌లు మాత్రం పార్టీ వీడుతున్నారు. మొన్న‌టి శ‌నివారమే పార్టీలో ఉన్న ప‌దిమంది నేత‌ల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు....హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా ద‌క్క‌క‌పోవ‌డం, గతనెల రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితిని, ప్రభుత్వ వైఖరిని, కేసీఆర్ వ్యూహాన్ని, కార్మిక సంఘాల భవిష్యత్ కార్యాచరణపై చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో...తెలంగాణ‌లో   పార్టీ అంతరించిపోతుందన్న ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టాలని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను పెంచాలని నాయ‌కుల‌ను కోరారు. అయితే, ఆ మాట వినేందుకు కూడా నేత‌లు లేని ప‌రిస్థితి. ఎందుకంటే...అంతా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోతున్నారు కాబ‌ట్టి! అని ప‌లువురు సెటైర్లు వేసుకుంటున్నారు.
Tags:    

Similar News