బీఫ్ బ్యాన్ మీద బీజేపీ వాళ్లే ఫైర్ !

Update: 2017-06-06 09:04 GMT
బీఫ్ అమ్మ‌కాల మీదా.. క‌బేళాల మీదా బీజేపీ తీసుకుంటున్న నిర్ణ‌యంపై ప‌లు రాజ‌కీయ పార్టీలు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఇది చాలా పాత విష‌యం కూడా. కానీ.. బీజేపీ నేత‌ల తీరుపై సొంత పార్టీ నేత‌లే క‌స్సుమంటున్న వైనం మాత్రం లేటెస్ట్ అని చెప్పాలి.

గోమాంసం పై నిషేధాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై మేఘాల‌య‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. సొంత పార్టీ నేత‌లే.. అధినాయ‌క‌త్వం తీరును బాహాటంగా త‌ప్పు ప‌డుతున్నారు. గోమాంసంపై నిషేధాన్ని వ్య‌తిరేకిస్తూ బీజేపీ నేత బెర్నార్డ్ మార‌క్ పార్టీ నుంచి వెళ్లిపోగా.. మ‌రో కీల‌క నేత బాచు మార‌క్ సైతం పార్టీకి రాజీనామా చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అంతేకాదు.. బీఫ్ నిషేధం మీద త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేసేందుకు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. త‌మ ప‌ద్ధ‌తులు.. ఆచారాలు.. సంప్ర‌దాయాల్ని బీజేపీ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. త‌మ మ‌నోభావాలు దెబ్బ తీసేలా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లుగా బాచు చెబుతున్నారు. ఇన్ని మాట‌లు చెప్పిన ఇత‌డ్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే త‌ప్పులో కాలేసిన‌ట్లు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న బాచు.. మేఘాల‌య బీజేపీలో కీల‌క‌భూమిక పోషిస్తున్నార‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మిగిలిన రాష్ట్రాల‌కు భిన్నంగా మేఘాల‌య‌లో సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌టంపై పార్టీ గుర్రుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ ప‌ద‌వుల‌కు నేత‌లు చేసిన రాజీనామాల్ని ఇంకా ఆమోదించ‌కుండా ఉంచ‌టం గ‌మనార్హం.  ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2018లో మేఘాల‌య‌లో బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే బీఫ్ మీద నిషేధం ఉండ‌ద‌ని.. సాధార‌ణ ధ‌ర‌ల‌కే బీఫ్ అంద‌రికి అందేలా చూడ‌ట‌మే త‌మ విధిగా బాచు మార‌క్ బీఫ్ నిషేధానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేప‌ట్ట‌టం బీజేపీలో ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. విప‌క్షాలు విరుచుకుప‌డ‌టం త‌ర్వాత‌.. సొంత పార్టీ నేత‌లే బీజేపీ చేప‌ట్టిన బీఫ్ నిషేధానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News