ఆ పార్టీ హుజూరాబాద్ లో అలా.. బద్వేల్ లో ఇలా..

Update: 2021-10-14 06:03 GMT
రౌతుకు తగ్గట్లు గుర్రం నడవటం తెలిసిందే. ఈ మాటకు అర్థం ఇట్టే తెలిసేలా పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్ని భర్తీ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని హుజూరాబాద్.. ఏపీలోని బద్వేల్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. హుజూరాబాద్ లో అధికార పక్షంతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నడుస్తుంటే.. బద్వేల్ లో మాత్రం కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితి.

హుజూరాబాద్ లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్.. బద్వేల్ లో పనతల సురేశ్ బరిలో ఉన్నారు. హుజూరాబాద్ లో సాగుతున్న ప్రచారాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు బద్వేల్ లో అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఏమో మాట వరసకు.. మొక్కుబడిగానే తన అభ్యర్థిని నిలిపిందని చెప్పాలి. దీనికి కారణం హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థికి ఉన్న బలమే. అదే సమయంలో బద్వేల్ లో బీజేపీ అభ్యర్థి కనీస పోటీ ఇచ్చేంత సత్తా లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఒక అసెంబ్లీ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వారు మరణిస్తే.. ఆ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సంప్రదాయం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. తర్వాతి కాలంలో దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ అవసరానికి అనుగుణంగా వాడుకోవటం తెలిసిందే.

బద్వేల్ ఉప ఎన్నిక విషయానికి వస్తే టీడీపీ.. జనసేనలు పాత సంప్రదాయాన్ని ప్రస్తావించి పోటీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ మాత్రం బరిలోకి దిగింది. హుజూరాబాద్ లో పెద్ద ఎత్తున నేతలు.. స్టార్ క్యాంపైనర్లు కమ్మేస్తుంటే.. బద్వేల్ లో ప్రచారానికి కనీస స్థాయి నేతలు కూడా వెళ్లని పరిస్థితి. హుజూరాబాద్ లో బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి బలమైన వాడు కావటంతో.. బద్వేల్ లో అందుకు భిన్నమైన వాతావరణం ఉండటంతోనే కామ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటప్పుడు బరిలో నిలవకుండా ఉంటే సరిపోయేది. పోటీ చేసి పరువు పోగొట్టుకునే కన్నా.. దూరంగా ఉండటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఏపీ బీజేపీ నేతలు ఈ లాజిక్ ను ఎందుకు మిస్ అయినట్లు?
Tags:    

Similar News