బాల‌కృష్ణ `ఎన్నిక‌ల‌` రాజ‌కీయాలు షురూ!

Update: 2018-06-28 08:11 GMT
విశ్వ విఖ్యాత - న‌ట సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క రామారావు న‌ట‌వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాల‌కృష్ణ....తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌నిపించుకున్నాడు. ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో నంద‌మూరి అభిమానుల‌ను - ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. త‌న తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ...ఆ రాజ‌కీయ వార‌సత్వాన్ని కూడా బాల‌కృష్ణ కొన‌సాగిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాల‌కృష్ణ‌కు అక్క‌డి ప్ర‌జ‌లు ఘ‌న విజ‌యాన్ని అందించారు. హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తాన‌న్న బాల‌య్య‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలో .....సినిమాల షూటింగ్ ల వ‌ల్ల‌నో - లేక ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల‌నో సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌కృష్ణ పెద్ద‌గా ప‌ర్య‌టించలేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అదీగాక‌, హిందూపురంలో బాల‌కృష్ణ పీఏ హ‌వా న‌డుస్తోంద‌ని గ‌తంలో చిన్న‌పాటి వివాదం చెల‌రేగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ నియోజ‌క వ‌ర్గంలో బాల‌య్య అస‌లు ప‌ర్య‌టించ‌డం లేదని...సంద‌ర్భానుసారంగా అడ‌పా ద‌డ‌పా ప‌ర్య‌టించే బాల‌య్య‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునే అవ‌కాశం ద‌క్క‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ఒక వేళ ఆ అవ‌కాశం దొరికినా సెల‌బ్రిటీ అయిన బాల‌య్య‌తో త‌మ స‌మ‌స్య‌లను  ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నామ‌ని ప‌లువురు వాపోయిన ఘ‌ట‌న‌లున్నాయి. కొద్ది రోజుల క్రితం హిందూపురంలో ప‌ర్య‌టించిన బాల‌య్య‌కు త‌మ ప్రాంత స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు వెళ్లిన ఓ వ్య‌క్తిపై బాల‌య్య‌...మండిప‌డ్డ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇటువంటి నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో బాల‌య్య గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని హిందూపురంలో టాక్ ఉంది.

ఈ నేప‌థ్యంతో పాటు అక్టోబ‌రులో ముందుస్తు ఎన్నిక‌ల‌పై ఊహాగానాలు వ‌స్తోన్న నేప‌థ్యంలో బాల‌య్య అప్ర‌మ‌త్త‌మ‌యిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా హిందూపురంలోని ఎస్సీ ఎస్టీ లు అధికంగా ఉండే గ్రామాల్లో బాల‌కృష్ణ ప‌ల్లె నిద్ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలోని చిల‌మ‌త్తూరు మండ‌లంలో బాల‌కృష్ణ ప‌ర్య‌టిస్తున్నారు. మూడు రోజుల పాటు అక్క‌డి ఎస్సీ - ఎస్టీ గ్రామాల్లో ప‌ల్లె నిద్ర కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు. ప‌ల్లె నిద్ర‌లో భాగంగా బుధ‌వారం నాడు ఎస్సీ కాల‌నీలో స‌హ‌పంక్తి భోజ‌నం చేసిన బాల‌య్య‌...అనంత‌రం ఓ ఇంట్లో ప‌ల్లె నిద్ర చేశారు. లుంగీ క‌ట్టి...ఓ ప్లాస్టిక్ న‌వారు మంచం మీద నిద్ర పోయారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో బొత్తిగా న‌ల్ల‌పూస అయిన బాల‌కృష్ణ‌....హ‌ఠాత్తుగా ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మంతో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో హిందూపురం ప్ర‌జ‌లు అవాక్క‌య్యారట‌.

ఈ నేప‌థ్యంలోనే బాల‌కృష్ణ తాజా ప‌ర్య‌ట‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య వెల్ల‌డైన ఓ స‌ర్వేలో గంటా ప‌నితీరు బాగోలేద‌ని రిపోర్టు వ‌చ్చిన నేప‌థ్యంలో....బాల‌కృష్ణ కూడా భుజాలు త‌డుముకున్నార‌ని - అందుకే ఉన్న‌ప‌ళంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదీగాక‌, అక్టోబ‌రులో ముంద‌స్తు ఎన్నిక‌ల పుకార్ల నేప‌థ్యంలో అలర్ట్ అయిన బాల‌య్య‌....ఈ టూర్ ప్లాన్ చేశార‌ని చెవులు కొరుక్కుంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌ల్లెనిద్ర కార్యక్ర‌మంతో బాల‌య్య కూడా ఎల‌క్ష‌న్ రాజ‌కీయాలు మొద‌లెట్టార‌ని, నికార్స‌యిన రాజ‌కీయ నేత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లేపాక్షి ఉత్స‌వాలు...అడ‌పాద‌డ‌పా కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్ప‌..... ఇప్ప‌టివ‌ర‌కు హిందూపురం వైపు క‌న్నెత్తి చూడ‌ని బాల‌య్య‌కు హ‌ఠాత్తుగా నియోజ‌క‌వ‌ర్గం పై ప్రేమ పుట్ట‌డం ఏమిటిని చ‌ర్చించుకుంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపున‌కు బాల‌య్య ఇప్ప‌టినుంచే వేసిన స్కెచ్ లో భాగంగానే ఇటువంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని అనుకుంటున్నారు. అయితే, బాల‌కృష్ణ‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ...వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు అంత సులువేమీ కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, నియోజ‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై బాల‌కృష్ణ స్పందించేస‌రికి `స‌మ‌యం`మించిపోయింద‌ని....ఇక ఎన్నిక‌ల `ర‌ణం` త‌ప్ప‌ద‌ని అనుకుంటున్నారు.
Tags:    

Similar News