రైతులకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా: మంత్రి

Update: 2020-09-02 16:00 GMT
రైతులకు ఉచిత విద్యుత్ సమస్య ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వం రైతుల కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెడుతూ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసే ప్రక్రియ చేపట్టడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ పై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులకు అన్యాయం జరిగిందని నిరూపిస్తే తానే రాజీనామా చేస్తానని.. లేకుంటే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ అని అన్నారు. పగటి పూట 9 గంటల పాటు సీఎం జగన్ ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు.

రైతుల ఉచిత విద్యుత్ కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి బాలినేని తెలిపారు. ప్రతీ రైతుకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ కు వ్యతిరేకి అని బాలినేని మండిపడ్డారు.

చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు అని.. విద్యుత్ బకాయిలు పెంచి రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బాబుది అని మంత్రి బాలినేని విమర్శించారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న విషయాన్ని రైతులు మర్చిపోలేదన్నారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం రైతులకు మేలు చేసేలా మార్చామని తెలిపారు. సీఎం జగన్ ఉన్నంత వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని బాలినేని చెప్పారు.
Tags:    

Similar News