ఓపెన్ గా మాట్లాడుకుందామా బాల్క సుమ‌న్‌

Update: 2017-12-05 15:30 GMT
రాజ‌కీయాలు చాలా క‌ఠిన‌మైన‌వి. అంత‌కు మించి క‌ర్క‌స‌మైన‌వి. కావాలంటే.. కోదండం మాష్టార్ని ఉద్దేశించి టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ మాట‌ల్ని వింటే ఇట్టే అర్థ‌మైపోతుంది. బాల్క సుమ‌న్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే మోడీ ల‌క్ష‌ణాలు కొన్ని కనిపిస్తాయి. ఉస్మానియా వ‌ర్సిటీ విద్యార్థి నేత‌గా రాజ‌కీయాల ఓనామానాలు దిద్దుకుంది కోదండం మాష్టారి ద‌గ్గ‌రే. ఆయ‌నే స్వ‌యంగా ప‌ల‌క‌.. బ‌లం చేతిలో పెట్టి మ‌రీ అ..ఆలు నేర్పించార‌ని చెప్పాలి.

అలాంటి మాష్టారిని బండ‌కేసి బాదేసిన‌ట్లుగా విమ‌ర్శ‌లు చేసేశారు బాల్క సుమ‌న్‌. త‌న‌ను గుర్తించి పైకి తీసుకొచ్చిన అద్వానీని ఎక్క‌డ దెబ్బేయాలో అక్క‌డేసిన మోడీని బాల్క సుమ‌న్ విష‌యంలో గుర్తుకు తెచ్చుకుంటుంటారు ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థులు. ఇప్పుడంటే సుమ‌న్ రేంజ్ పెరిగిపోయింది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ద‌గ్గ‌ర జ‌రిగే ఆవ‌ర‌ణ‌లో హ‌డావుడిగా తిరిగేవారు. కాకుంటే.. ఆవేశంతో కాకుండా స్నేహింతో అంద‌రిని త‌న దారికి తెచ్చుకునే సుమ‌న్‌కు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా టీఆర్ ఎస్ త‌ర‌పున పోటీ చేసే అవ‌కాశం రావ‌టం.. ఆయ‌న గెల‌వ‌టంతో విద్యార్థి నేత కాస్తా ఎంపీ అయిపోయారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్  ఆశీస్సులు సొంతం చేసుకున్న సుమ‌న్ ఇప్పుడు యువ‌శ‌క్తిగా మారారు. త‌న‌దైన దూకుడు వ్యాఖ్య‌ల‌తో పాటు.. తాను ఎంపీ కావ‌టానికి అవ‌కాశం ఇచ్చిన కేసీఆర్‌కు వీర విధేయుడిగా  మారిపోయారు. అధినేత మ‌న‌సును గెలుచుకోవ‌టం కోసం ఎంత‌కైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న తాజాగా కొలువుల కోట్లాట స‌భ నేప‌థ్యంలో కోదండం మాష్టారిపై భీక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ఎస్ నేత‌లు ప‌లువురు కోదండ‌రాంపై విమ‌ర్శ‌లు చేసినా అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. బాల్క సుమ‌న్ లాంటోడు సైతం వెనుకా ముందు చూసుకోకుండా మాట‌లు అనేయ‌టం చూస్తే.. మారిన రాజ‌కీయాలు ఎలా ఉంటాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కీ కోదండం మాష్టార‌న్ని ఉద్దేశించి బాల్క సుమ‌న్  చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. మాష్టారు చేప‌ట్టిన కొట్లాట కొలువ‌ల కోసం కాద‌ని.. ప‌ద‌వి కోసం చేప‌ట్టిన తండ్లాట‌గా అభివ‌ర్ణించారు. కోదండం మాష్టారు కానీ తీరు మార్చుకోక‌పోతే.. విద్యార్థులు.. యువ‌తే త‌గిన బుద్ధి చెబుతారంటూ విప‌రీత‌మైన వ్యాఖ్య చేసేశారు. బాల్క సుమ‌న్ ఇన్ని మాట‌లు అన్నాక‌.. కాస్త ఓపెన్ గా సూటిగా ఒక్క మాట‌ను సంధిస్తున్నారు ప‌లువురు ఉస్మానియా విద్యార్థులు. నిజంగా కోదండం మాష్టారు ప‌ద‌వి కోరుకుంటే తండ్లాట అవ‌స‌ర‌మా?  సీఎం కేసీఆర్‌కు ఒక్క రాజీ వ‌ర్త‌మానం పంపితే స‌రిపోదా? అని. ఏమంటావ్ సుమ‌న్‌..?
Tags:    

Similar News