ప్రముఖుడు కాని ఆ వ్యక్తికి పాజిటివ్.. నేషనల్ న్యూస్ అయ్యింది

Update: 2020-06-22 05:15 GMT
ఇదేం దేశంలోనే మొదటి పాజిటివ్ కేసు కాదు. ఇప్పటికే లక్షలాది మంది మహమ్మారి బారిన చిక్కుకుంటున్నారు. ఇదే తీరు ఇంకెంత కాలం కొనసాగుతుందో కూడా చెప్ప లేని పరిస్థితి. గంట గంటకు పెరుగుతున్న పాజిటివ్ ల సంఖ్య తో ప్రభుత్వాలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అలాంటివేళ.. ఏ రంగంలోనూ ప్రముఖుడు కాని ఒక వ్యక్తికి పాజిటివ్ గా తేలటం జాతీయ వార్తగా మారింది. ఇంతకీ అతగాడు ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. అతడే.. బల్బీర్ చంద్. పేరు విన్నట్లు లేదే అన్న భావన కలుగక మానదు.

కానీ.. అతడి పేరు కంటే.. క్రికెట్ దేవుడు సచిన్ డూప్ అన్నంతనే బల్బీర్ చంద్ కళ్ల ముందు మెదులుతాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ను పోలినట్లు ఉండే బల్బీర్ చంద్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు. కానీ.. ఉండేది మాత్రం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో. ముఖ కవళికలు సచిన్ ను తలపించేలా ఉంటే.. అతడు తన సొంతూరు నవాశహర్ కు వెళ్లారు. అక్కడే ఆయనకు మహమ్మారి సోకిన విషయాన్ని గుర్తించారు.

ఆ వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతను మహమ్మారిని జయించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం అతడ్ని వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మాయదారి రోగానికి భయ పడాల్సిన అవసరం లేదన్న బల్బీర్ చంద్ మాట చాలామందికి ఊరటనిస్తోంది. దీంతో.. ఆయన ఉదంతం జాతీయ వార్తగా మారింది.

మిగిలిన రాష్ట్రాల్లో మాదిరే పంజాబ్ లోనూ పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువ గానే ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రం లో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేల మార్కును దాటింది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం పంజాబ్ లో 1275 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మహమ్మారి కారణంగా 99 మంది మరణించారు.
Tags:    

Similar News