తరచూ నేరాలకు పాల్పడే నేతాశ్రీలకు ఇక రాజకీయంగా చావు దెబ్బ పడిపోతోంది. చాలామంది రాజకీయ నేతలు పూర్వాశ్రమంలో లెక్కలేనన్ని నేరాలకు పాల్పడి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. అంటే గతంలో తాము చేసిన నేరాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు నేరగాళ్లు రాజకీయాలను ఆశ్రయిస్తున్నారన్న మాట. ఇది ఒక ఎత్తైతే... రాజకీయాల్లో కాకలు తీరిన యోధులుగా పేరుగాంచిన పలువురు నేతలు కూడా ఆ తర్వాత అక్రమార్జనకు తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా తక్కువ మందే చట్టానికి దొరుకుతున్నా... ప్రస్తుతం చట్టంలోని లొసుగుల కారణంగా వారినేమీ చేయలేని పరిస్థితి. ఈ తరహా ఉదాసీనతలపై అటు ప్రజలతో పాటు ఇటు కోర్టులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం మనకు తెలియనిదేమీ కాదు.
ఇలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా... నేరమయ రాజకీయాలకు అడ్డుకట్ట పడాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. అదే సమయంలో ఆ అంశాన్ని జనం చాలా త్వరగానే మరిచిపోతున్నారు కూడా. అయినా ఈ అంశం ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.... నేరమయ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏదేని కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తిపై కొంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేథం అమలవుతోంది. అయితే ఆ స్వల్పకాలిక వ్యవధి ముగిసిన వెంటనే తిరిగి ఆ నేరస్తులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో నిలిచి చట్టసభల్లోనూ అడుగుపెడుతున్నారు. ఇక నేరస్తుడిగా నిరూపితం కానంత వరకు ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా ఆయా రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. చట్టసభల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.
మరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంచలన నిర్ణయం విషయానికి వస్తే... ఏదేనీ కేసులో నేరం రుజువైతే.... సదరు నేతలు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడానికి పూర్తిగా అనర్హులేనన్న మాట. ఇలాంటి కఠిన చట్టం అమలుకు తొలి అడుగు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం... ఏదేనీ కేసులో నేరస్తుడి తేలని నేతలను రాజకీయాల నుంచి జీవితకాలం పాటు నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు నేడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. గతంలోనూ ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా... నాడు దీనిపై తన వైఖరిని స్పష్టం చేసే విషయంలో ఎన్నికల సంఘం అంతగా ఆసక్తి చూపలేదు. ఆసక్తి చూపలేదు అనే కంటే... అంత కీలక నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన అర్హత తనకు ఉందా? అన్న డైలమాలో పడిపోయిన ఎన్నికల సంఘం నాడు తన నిర్ణయాన్ని విస్పష్టంగా చెప్పలేకపోయింది.
అయితే దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను నిర్దేశించే అధికారం కూడా ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో నేరుగా రంగంలోకి దిగేసిన ఎన్నికల సంఘం... నేరస్తులుగా తేలిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాలం పాటు నిషేధం విధించాలని కోర్టును కోరింది. దీనికి కోర్టు కూడా సరేనంటే... నేరాలకు పాల్పడే నేతాశ్రీలకు ఇక చుక్కలు కనిపించినట్లే. ఈ నిబంధన అమల్లోకి వస్తే... ప్రప్రథమంగా ఆర్జేడీ అధినేత - బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం జైల్లో కూర్చున్న శశికళలపై దెబ్బ పడిపోతుంది.