అనూహ్యమైన రీతిలో కేంద్ర కేబినెట్ విస్తరణలో బెర్తు కోల్పోయిన సికింద్రాబాద్ ఎంపీ - బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పార్టీ పట్ల తన విదేయతను చాటుకుంటూనే ఉన్నారు. గవర్నర్ గిరీ కట్టబెడుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఆచరణ రూపం దాల్చలేదు. అయినప్పటికీ దత్తాత్రేయ తన చిత్తశుద్ధిని కొనసాగిస్తున్నారు. తన మార్కు ఆత్మీయ కార్యక్రమమైన అలాయ్ బలాయ్ సంబురాన్ని కూడా ఆయన కొనసాగించారు. అయితే కొద్దికాలంగా తనపై జరుగుతున్న ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు.
గవర్నర్ పదవి తీసుకొని రాజ్ భవన్ లో ఉండటం పట్ల తనకు ఆసక్తి లేదని ప్రజాభవన్ లోనే ఉంటానని సికింద్రాబాద్ ఎంపీ అయిన బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో త్వరలో గవర్నర్ గా నియమించే అవకాశాలున్నాయని, ఎన్నికలకు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా...పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని వ్యాఖ్యానించిన దత్తాత్రేయ...పలువురు ముఖ్యనేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారనే విషయంలో స్పందించేందుకు నిరాకరించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం వెల్లి ప్రభుత్వాన్ని పొగడటంపై తాను స్పందించబోనని అయితే...కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం గురించి ఆయన పేర్కొనాల్సిందని అన్నారు.
2019 ఎలక్షన్ టీం అంటూ నలుగురు బ్యూరోక్రాట్లు సహా మొత్తం 9 కొత్త ముఖాలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి, ఆరుగురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో చోటు కోల్పోయిన ఈ మాజీ మంత్రుల్లో కొందరికి పార్టీలో పదోన్నతి కల్పించి - కొత్త బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని ప్రచారం సాగింది. అయితే రాజీనామా చేసిన అందరికీ పదవులు దక్కే అవకాశం లేదని చెప్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ - మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి ఇప్పట్లో లేదని తెలుస్తోంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఉద్వాసనకు గురైన ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయని ఇందుకు ఇద్దరూ లోక్ సభ ఎంపీలు కావడమే కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.