గేమ్ చేంజర్.. నేమ్ చేంజర్.. ఫేట్ చేంజర్.. ఎవరిని ఎవరన్నారంటే?

Update: 2022-10-06 04:28 GMT
అనుకున్నట్లే తన పార్టీ పేరును మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ రోజున ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

కేసీఆర్ నోటి నుంచి అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఒక మోస్తరు నేతలు రోడ్ల మీదకు వచ్చి బాణసంచాను కాల్చటం.. మిఠాయిలు పంచుకోవటం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయటం లాంటివి చేశారు.

కేంద్రంలో తెలంగాణ మార్క్ డెవలప్ మెంట్ ను చూపించే లక్ష్యంగా పెట్టిన రాజకీయ పార్టీపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. ఇలాంటి వేళ.. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసే వారు ఉన్నట్లే.. ఆయన్ను టార్గెట్ చేసి భారీగా పంచ్ లు వేస్తూ విమర్శనాస్త్రాల్ని సంధించిన వారు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ 'బీఆర్ఎస్' ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేసిన ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఒకే ట్వీట్ తో కేసీఆర్.. కేటీఆర్ లను లక్ష్యంగా చేసుకున్న ఆయన సెటైరిక్ పంచ్ లు విసిరారు. 'కేటీఆర్ఎస్ ట్విటర్ టిల్లు గేమ్ చేంజర్ అని.. తండ్రి కేసీఆర్ నేమ్ చేంజర్ అయ్యారని.. అంతిమంగా ప్రజలు ఫేట్ చేంజర్ అవుతారు' అంటూ తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారంటూ మరో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  రియాక్టు అవుతూ.. కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని.. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు.

అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయటమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? అని ప్రశ్నించిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాదు.. తెలంగాణ లిక్కర్ పాలసీని దేశానికి విస్తరించజేయటమే కేసీఆర్ లక్ష్యమా? అని కూడా నిలదీశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News