లాక‌ర్ల‌పై ఆర్బీఐ దిమ్మ‌తిరిగే విష‌యం చెప్పిందిగా!

Update: 2017-06-26 04:23 GMT
బ్యాంకు ఖాతాల్లో సొమ్ము దాచుకుంటాం. ఆ సొమ్ము కంటే కూడా కాస్తంత ఎక్కువ‌గా, అది కూడా న‌ల్ల‌ధ‌న‌మైతే... స‌ద‌రు సొమ్ము నేరుగా లాక‌ర్ల‌లోకి వెళుతోంది. ఈ విష‌యం ఒక్క అవినీతిప‌రుల‌కు మాత్ర‌మే వ‌ర్తించినా... సామాన్య జ‌నం కూడా త‌మ వ‌ద్ద ఉన్న విలువైన వ‌స్తువుల‌ను, డాక్యుమెంట్ల‌ను భ‌ద్రంగా దాచుకునేందుకు బ్యాంకు లాక‌ర్ల‌నే ఆశ్ర‌యిస్తున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో అవినీతి నిరోధ‌క శాఖ చేస్తున్న దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుబ‌డుతున్న లంచ‌గొండులు... త‌మ అక్ర‌మ సొత్తునంత‌టినీ బ్యాంకు లాక‌ర్ల‌లోనే దాచుకున్న‌ట్లు తేటతెల్ల‌మైన విష‌యం తెలిసిందే.

అయితే బ్యాంకు ఖాతాల్లో మ‌నం భ‌ద్రంగా దాచుకున్న సొమ్ముకైతే ఎలాంటి ఇబ్బంది లేదు గానీ..  బ్యాంకు లాక‌ర్ల‌లో మ‌నం దాచుకునే విలువైన వ‌స్తువుల మాటేమిటి? అన్న విష‌యంపై భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చేసింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అందిన ఓ ద‌ర‌ఖాస్తుకు స్పందించిన ఆర్బీఐ... బ్యాంకు లాక‌ర్లు సేఫ్ కాద‌ని తేల్చి చెప్పింది. విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఇది ముమ్మాటికీ నిజం.

బ్యాంకు శాఖ‌లు త‌మ శాఖ కార్యాల‌యాల్లో కొంత మేర స్థలాన్ని లాక‌ర్ల‌కు కేటాయిస్తున్నాయి. ఇలా అన్ని బ్యాంకు శాఖ‌ల్లో లేకున్నా... వినియోగ‌దారుల డిమాండ్‌ ఆధారంగా చాలా శాఖ‌ల్లో ఇప్పుడు లాక‌ర్ సౌకర్యం అందుబాటులోకి వ‌చ్చేసింది. ఈ లాక‌ర్ల‌ను వినియోగ‌దారుల అభ్య‌ర్థ‌న మేర‌కు వారికి కేటాయిస్తుంది. అందుకు గానూ వారి వ‌ద్ద నుంచి కొంత మేర ఫీజును వ‌సూలు చేస్తుంది. ఈ లెక్క‌న మ‌న చేతికి వ‌చ్చే లాక‌ర్ల‌లో మ‌న ఇంటిలోని అత్యంత‌ విలువైన ద‌స్తావేజులు - ఆభ‌ర‌ణాలు త‌దిత‌రాల‌ను దాచుకుంటున్నాం. అవినీతి తిమింగ‌లాలైతే... అమ్యామ్యాల రూపంలో వ‌చ్చిన న‌గ‌దును కూడా వీటిలో దాచుకుంటున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఏ అగ్ని ప్ర‌మాద‌మో, చోరీనో జ‌రిగే దాకా లాక‌ర్ల‌లోని మ‌న సొమ్ము భ‌ద్రంగానే ఉంటుంది.

అనుకోని రీతిలో అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగి లాక‌ర్లు - వాటిలోని విలువైన సొత్తు కాలిపోతే, చోరులు వ‌చ్చి బ్యాంకు చెస్ట్ లోని న‌గ‌దుతో పాటు లాక‌ర్ల‌లోని విలువైన సొత్తు తీసుకెళితే ప‌రిస్థితి ఏమిటి?  బ్యాంకు ఖాతాల్లోని మ‌న సొమ్మును బ్యాంకు ఎలాగోలా స‌ర్దుబాటు చేస్తుంది. ఎందుకంటే అప్ప‌టిదాకా మ‌నం జ‌మ చేసిన మొత్తాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేసుకునే బ్యాంకులు ఆ మేర మొత్తాన్ని మ‌న‌కు ఇచ్చేస్తాయి. అయితే సీక్రెసీ కోసం మ‌నం లాక‌ర్ల‌ను తీసుకుని, వాటిలో పెట్టే వ‌స్తువుల వివ‌రాల‌ను బ్యాంకు అధికారుల‌కు చెప్ప‌లేం క‌దా. అందుకే... చోరీకి గురైన లాక‌ర్ల‌లోని సొత్తుతో బ్యాంక‌ర్ల‌కు సంబంధం లేద‌ట‌. ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన ఆర్బీఐ... లాక‌ర్ల‌లోని సొత్తు పోతే దానికి బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వ‌ని, ఈ క్ర‌మంలో సేఫ్ లాక‌ర్ల పేరిట మ‌నం పిలుస్తున్న లాక‌ర్లు ఏమాత్రం సేఫ్ కాద‌ని తేల్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News