బొమ్మై ఎంపిక వెనుక కమలనాథుల కసరత్తు అంతాఇంతా కాదు

Update: 2021-07-29 03:26 GMT
కనిపించేవన్ని నిజాలు కావన్న నగ్నసత్యం తెలిసినా.. ఆ విషయం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడని తీరు రాజకీయాల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. బీజేపీ అధిష్ఠానం కదిపిన పావులతో.. ఒక సీనియర్ నేతకు గౌరవ ప్రదమైన నిష్క్రమణకు తెర తీశారు. వాజ్ పేయ్ - అద్వానీ హయాంలోని నేతలను పార్టీలో ఇన్ యాక్టివ్ గా చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బీజేపీలో ఒక వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు ఉనికిని కోల్పోయి.. పెద్ద మనుషుల కోటాలో తప్పించి మరెందులోనూ వారి పాత్ర లేకుండా చేయటంలో మోడీషాలు సక్సెస్ అయ్యారని చెప్పాలి. బీజేపీలో పైనుంచి కిందవరకు సంస్కరణల్ని విజయవంతంగా తీసుకొచ్చారు మోడీషాలు.

తమ వారు తప్పించి.. తమను వ్యతిరేకించే వారిని కీలక స్థానాల్లో ఉండకుండా చేయటంలో విజయవంతం అవుతున్నా.. కొన్ని పరిమితులకు మాత్రం దూరంగా ఉండక తప్పట్లేదు. అలాంటి వారి విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో పక్కకు తప్పిస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువైంది. ఎవరి దాకానో ఎందుకు?.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నయడ్యూరప్పను ఎంత తెలివిగా.. సీఎం సీటు నుంచి ఖాళీ చేసి.. తర్వాతి తరం నేతలకు అవకాశం ఇచ్చిన తీరు తెలిసిందే. యడ్డీ ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖను నిర్వహిస్తున్న బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం ద్వారా.. కొత్త తరానికి తెర తీశారని చెప్పాలి. దాదాపు 41 ఏళ్ల క్రితం కర్ణాటకకు తొమ్మిది నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తన తండ్రికి తగ్గ వారసుడిగా బసవరాజ్ బొమ్మై ఇప్పుడు అందరి నోట నానుతున్నారు.

వ్యాపారవేత్తగా మారేందుకు బెంగళూరు వచ్చిన ఇంజనీర్ కాస్తా.. రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావటం చాలా అరుదుగా జరిగేది. బసవరాజ్ విషయంలో అది కాస్తా నిజమైంది. కరోనా వేళలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపించటం.. అంతకంతకూ పెరుగుతునన అవినీతి.. పార్టీలో ఎక్కువైన అసమ్మతికి చెక్ చెప్పేందుకు.. యడ్డీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కర్ణాటక బీజేపీలో ప్రజల్లో మాంచి ఇమేజ్ ఉన్న యడ్డీని ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా.. పార్టీకి నష్టమన్న విషయాన్ని గుర్తించి.. ఆయన్ను పదవిలో నుంచి దింపటం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని.. వేళ్ల మీద లెక్కించే వారికి మాత్రమే అధికార బదిలీ జరుగుతుందన్న విషయం ముందస్తుగా తెలుసన్న మాట వినిపిస్తోంది.

తాజా ఎపిసోడ్ లో ఒక దెబ్బకు రెండు పిట్టలన్న నానుడ్ని బీజేపీ అధినాయకత్వం నిజం చేసిందని చెప్పాలి. గౌరవ ప్రదంగా యడ్డీని సాగనంపుతున్నట్లుగా కనిపించేలా.. ఆయన ఇమేజ్ కు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ఉండేలా చేయటంలో మోడీషాలు సఫలమయ్యారని చెప్పాలి. తన సీఎం పదవికి రాజీనామా చేసే సమయంలో యడ్డీ చేసిన డిమాండ్లకు పార్టీ ఓకే చెప్పటం గమనార్హం. ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా.. ఆయన ప్రభ ఏ మాత్రం తగ్గనిరీతిలో.. ఆయన చిన్న కుమారుడు కమ్ రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షుడైన 45 ఏళ్లవిజయేంద్ర ప్రాధాన్యతకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న హామీని ఇచ్చినట్లు చెబుతారు.

ఒక దెబ్బకు రెండు పిట్టలన్న విషయాన్ని చూస్తే.. అందులో మొదటిది యడ్డీ చేతిలో ఉన్న అధికారాన్ని బొమ్మై చేతికి మారినా.. రాష్ట్ర ఓటర్లలో కీలకమైన లింగాయత్ సామాజిక వర్గం తమతోనే ఉండేలా ప్లాన్ చేశారు. రెండోది.. యడ్డీకి నమ్మకస్తుడైన బొమ్మైకే సీఎంపగ్గాలు ఇవ్వటం వల్ల కొత్త అసమ్మతి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో సక్సెస్ అయ్యారు. యడ్డీ వారసుడిగా సీఎం కుర్చీలో కూర్చున్న బొమ్మై చేయాల్సిన రిపేర్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వేళ అతనికి ఉన్న 20 నెలల సమయం చాలా తక్కువనే చెప్పాలి. ఆ లోపున తన అధికారాన్ని నిలుపుకోవటం బీజేపీకి తప్పనిసరి అవుతుందన్నది మర్చిపోకూడదు.

ఇంజనీర్ గా.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా వ్యవహరించిన బొమ్మైకు సంబంధించిన అంశాలు అందరికి తెలిసినా.. ఆయనలోని క్రికెటర్ గురించి కొంతమందికే గుర్తుంటుంది. గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరించిన బసవరాజ్ బొమ్మై నాయకత్వంతో కర్ణాటక బీజేపీ టీం ఎంత హుషారుగా పని చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోడీషాలు అంచనా వేసుకున్నట్లే బొమ్మై 2023లో సిక్స్ కొడతారా? అనూహ్యంగా అవుట్ అవుతారా? అన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News