క‌న్న‌డ‌ కేబినెట్ ఇదే.. ఆ సీటును మాత్రం ముట్టుకోలేదు!

Update: 2021-08-04 12:30 GMT
క‌ర్నాట‌క కొత్త ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై కేబినెట్ సిద్ధ‌మైంది. బుధ‌వారం నూత‌న మంత్రులు ప్ర‌మాణం చేశారు. మొత్తం 29 మందితో మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. అత్యంత కీల‌క‌మైన ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని మాత్రం ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. డిప్యూటీ కోసం భారీస్థాయిలో ఆశావ‌హులు ఉన్నందునే ఈ నిర్ణ‌యంత తీసుకున్న‌ట్టు తెలిసింది.

కొత్త కేబినెట్ లోనూ కుల స‌మీక‌ర‌ణ‌లు ప‌టిష్టంగా ఫాలో అయ్యారు. క‌న్న‌డ నాట బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి అత్య‌ధికంగా 8 సీట్లు కేటాయించారు. ఓబీసీ, వ‌క్క‌ళిగ వ‌ర్గాల‌కు చెరో 7 స్థానాల‌ను కేటాయించారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ముగ్గురు, ఎస్టీ నుంచి ఒక‌రు, రెడ్డి క‌మ్యూనిటీ నుంచి ఒక‌రికి సీటు రిజ‌ర్వ్ చేశారు. అయితే.. మొత్తం 34 మంది మంత్రుల‌ను నియ‌మించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. తొలి విడ‌త‌గా 29 మందికి మాత్ర‌మే ఛాన్స్ ఇచ్చారు.

కీల‌క‌మైన డిప్యూటీ సీఎం ప‌ద‌విని మాత్రం ఎవ‌రికీ కేటాయించ‌లేదు. ఇది బీజేపీ అధిష్టానం నిర్ణ‌యంగా భావిస్తున్నారు. చాలా మంది ఈ ప‌ద‌విని ఆశిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు. ఇక‌, మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప కుమారుడు విజ‌యేంద్ర‌ను కేబినెట్లోకి తీసుకుంటార‌నే వార్త‌లు వినిపించినా.. అదేం జ‌ర‌గ‌లేదు. అధిష్టానమే విజ‌యేంద్ర‌తో మాట్లాడింద‌ని బొమ్మై చెప్పారు. కేబినెట్ కూర్పుపై అందరూ సంతృప్తిగా ఉన్నార‌ని, ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్పుకొచ్చారు కొత్త సీఎం.

కానీ.. వాస్త‌వంలో ప‌రిస్థితి వేరే ఉంద‌న్న‌ది టాక్‌. రాష్ట్రంలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న మైసూర్, బళ్లారి, గుల్బర్గా, కొడగు, హసన్, దావంగెరె, రామనగర, రాయచూర్, విజయపుర, యాదగిరి, చామరాజనగర్, చిక్‌మగళూర్‌, కోలార్ జిల్లాలకు మంత్రివ‌ర్గంలో ప్రాతినిథ్యం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దశలవారీగా కేబినెట్‌ విస్తరిస్తానని సీఎం చెప్ప‌డం ద్వారా.. నిర‌స‌న‌ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

నిజానికి బ‌స‌వ‌రాజ్ బొమ్మైని సీఎం సీటులో కూర్చోపెట్ట‌డంతో చాలా మంది బీజేపీ నేత‌లు ఉడికిపోయారు. కొంద‌రు ఆపుకోలేక‌ బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కారు కూడా. కార‌ణం.. బొమ్మై చాలా మందికి జూనియ‌ర్ కావ‌డ‌మే. గ‌తంలో క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన జ‌గ‌దీష్ షెట్ట‌ర్‌.. బొమ్మై కేబినెట్లో త‌న‌కు సీటు అవ‌స‌రం లేద‌ని ఓపెన్ గా చెప్పేశారు. ముఖ్య‌మంత్రి సీటు ఆశించిన వారిలో జ‌గ‌దీష్ కూడా ఉన్నారు. త‌న‌కు కాకుండా.. బొమ్మైకి ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న గుర్రుగా ఉన్నార‌నే విష‌యం.. ఆ ప్ర‌క‌ట‌న‌తో బ‌య‌ట‌ప‌డిపోయింది.

ఇక, మ‌రో సీనియ‌ర్ నేత శ్రీరాములు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. నిజానికి క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ శ్రీరాములుకు హైక‌మాండ్ ఫుల్ ప్ర‌యారిటీ ఇచ్చింది. ఒక దశలో ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. ఇప్పుడు ఆయ‌న ఊసే లేకపోవ‌డంతో ఆయ‌న గుర్రుగా ఉన్నార‌ని చెబుతున్నారు. బ‌య‌ట‌ప‌డ‌ని వారు ఇంకా చాలా మందే ఉన్నార‌ని స‌మాచారం. అలాంటి వాళ్లంద‌రికీ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణ‌యించినట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌సీ మాదిరిగా.. మొత్తం ఐదు డిప్యూటీలు ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉండ‌డంతో తేనె తుట్టెను క‌ద‌ప‌డం ఎందుక‌ని, ఈ వేడి త‌గ్గిన త‌ర్వాత చూద్దామ‌ని ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతానికైతే.. మంత్రివ‌ర్గ ప్ర‌మాణం సాఫీగానే సాగింది. మ‌రి, ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుంది? బొమ్మై ఎలా మేనేజ్ చేస్తార‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News