వరంగల్... చాలా హాట్ గురూ...!?

Update: 2018-09-25 15:57 GMT
వరంగల్... మిర్చి మార్కెట్‌ కు పెట్టింది పేరు. అయితే అది కాస్తా ఇప్పుడు రాజకీయ హీట్  కు పెట్టింది పేరుగా మారుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నేతల విమర్శలు - దీనికి అధికార టిఆర్ ఎస్ నాయకుల స్పందనతో వరంగల్ ఒక్కటే కాదు... మొత్తం తెలంగాణ అంతటా కాక పుట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే.... వరంగల్‌ కు చెందిన సీనియర్ నాయకులు కొండా సురేఖ - కొండా మురళి తమకు టిక్కట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు - ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావులపై నిప్పులు చెరిగారు. వీరిద్దరి వల్ల తెలంగాణలో అభివృద్ధి లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ బహిరంగ లేఖ రాసారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రతి పనికి కమీషన్ల మీద కమిషన్లు చెల్లించాలంటూ విమర్శించారు. తాము స్వతంత్రంగా పోటీ చేసినా తమను ఓడించే వారు ఎవ్వరూ లేరంటూ ఛాలెంజ్ కూడా చేశారు.

 దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ  - ఆమె భర్త కొండా మురళీ రౌడీ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవ్వరూ లేరంటూ ఎదురుదాడికి దిగారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతుల గురించి తెలియని వారు లేరని - వారి అవినీతి జిల్లాలో అందరికీ తెలుసునంటూ పార్టీ నాయకుడు బస్వరాజు సారయ్య మండిపడ్డారు. వారి రౌడీయిజానికి ఎవ్వరూ భయపడరని కూడా అన్నారు. దిగజారుడు మాటలు మాటలు మాట్లాడుతున్న కొండా కుటుంబాన్ని వరంగల్ నుంచే కాదు...తెలంగాణ నుంచే తరిమేయాలని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నాయకులు కూడా కొండ సురేఖ దంపతులపై మండిపడుతున్నారు. మొత్తానికి కొండ దంపతులు రేపిన దుమారంతో వరంగల్ రాజకీయాలు చాలా హాట్‌ గురూ అంటున్నాయి. కొండా సురేఖ దంపతులకు కార్యకర్తల బలం ఉందని - అయితే అది వారిని విజయ తీరాలకు చేరుస్తుందా అన్నది తేలాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కొండా దంపతులు జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం జిల్లా నాయకత్వానికి సూచించినట్లు సమాచారం.

Tags:    

Similar News