బీఫ్ ఫెస్టివల్...గత ఏడాది ఈ అంశంపై వివిధ ప్రాంతాల్లో జరిగిన రచ్చ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు అదే వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. అయితే అది కొత్త రూపంలో! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల కావడం విశేషం. పశువుల సంతలలో క్రయ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమం లో వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళలో వినూత్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బీఫ్ ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేశారు. ముస్లింలు, క్రైస్తవులు మాంసం విందు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల అధికార ఎల్ డిఎఫ్ - ప్రతిపక్ష కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుడిఎఫ్, వాటి యువజన విభాగాలకు చెందిన కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. బీఫ్ పంపిణీ చేశారు. రాష్ట్ర సచివాలయం ఎదుట కార్యకర్తలు మాంసం వండి , రోడ్డు పక్కన ఉంచి వచ్చిపొయ్యేవారికి వడ్డించారు.
కేంద్రం వెలువరించిన గెజిట్ ను చింపేసి చెత్తబుట్టలో వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - కేంద్ర మాజీ మంత్రి ఆంటోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల వధ నిషేధానికి వ్యతిరేకంగా సోమవారం యుడిఎఫ్ బ్లాక్ డేను నిర్వహిస్తుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చెన్నితాల రమేష్ తెలిపారు.కొల్లం జిల్లాలో డీసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బీఫ్ తో విందు జరిపారు. ఇతర జిల్లా కేంద్రాలు, పట్టణాలలో కూడా నిరసనలు సాగాయి. తాము వండిన రుచికరమైన బీఫ్ ను పోస్టల్ పార్శిల్ ద్వారా ప్రధాని మోడీకి పంపిస్తామని కొల్లం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బిందు కృష్ణ విలేకరులకు తెలిపారు. బీఫ్ వండి వడ్డించడం, తాము తినడంతో ప్రధాని మోడీకి నిరసనను తెలియచేస్తామని వామపక్ష అనుబంధ సంఘమైన డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు మెహమ్మద్ రియాజ్ తెలిపారు.
ఇదిలా వుండగా పశువుల సంతలలో క్రయ విక్రయాలపై నియంత్రణను మంత్రి మేనకా గాంధీ సమర్ధించారు. ఈ నిర్ణయంతో జంతువులకు రక్షణ కలుగుతుందన్నారు. అదే విధంగా పర్యావరణానికి పొంచివున్న ముప్పు కూడా తగ్గుముఖం పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్రాలు కూడా మద్దతు పలకాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/