దళితులను గేదెలతో పోల్చిన కంచె ఐలయ్య

Update: 2018-02-10 12:19 GMT
ప్రొఫెసర్ కంచె ఐలయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని దళితులను ఆయన గేదెలతో పోల్చారు. అంతేకాదు... గేదెలు - ఆవుల మధ్య వివక్ష ఉందంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. పాపం.. మనుషుల భాష - విపరీత భావనలు తెలియవు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పశువుల మధ్య కూడా ఇప్పుడు కలహాలు మొదలయ్యేవేమో.
    
దేశంలో ప్ర‌జ‌లు వినియోగించే పాల‌లో అత్య‌ధిక శాతం గేదెల నుంచి తీసిన‌వే అయిన‌ప్ప‌టికీ ఆవుకు ఉన్న ప్రాధాన్యం గేదెకు లేదని ఐలయ్య అన్నారు. అంతేకాదు... ఆ విషయాన్ని ద‌ళితుల ప‌రిస్థితికి ముడిపెట్టారు. ద‌ళితులు కూడా అనేక విధాలుగా క‌ష్ట‌ప‌డుతునే ఉన్నార‌ని..కానీ వారికి త‌గిన ప్రాధాన్య‌త ఉండ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో దళితుల సమస్యలు ప్రస్తావించడం వేరు.. సంబంధం లేని అంశాలతో ముడిపెట్టడం తగదని విమర్శలొస్తున్నాయి.
    
కేరళ‌లో జ‌రుగుతున్న లిట‌ర‌సీ ఫెస్టివ‌ల్‌లో పాల్గొన్న ఆయన అక్కడ గౌరీ ద‌ర్శ‌న్ నాయ‌ర్ అనే ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్ట్‌తో సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”బీయింగ్ ఏ ద‌ళిత్ ఇన్ ఇండియా” అనే అంశంపై ఐల‌య్య మాట్లాడుతూ.. పెద్ద పెద్ద ఆశ‌ల‌తో జీవితంలో ముందుకు సాగాల‌ని ఆయ‌న ద‌ళితుల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం ఇచ్చే కొద్దిపాటి భూమి కోసం పోరాటం చేయ‌డం మానేసి అమెరికాలోలా అద్య‌క్షుడు కావ‌డం వంటి పెద్ద పెద్ద ల‌క్ష్యాలు పెట్టుకోవాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు.
    
వ్య‌వ‌సాయం, రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం వంటి ప‌నుల‌ను ద‌ళితులు మానుకోవాల‌ని ఐల‌య్య పిలుపునిచ్చారు. ఆ ప‌నుల‌ను బ‌నియాల‌ను, బ్రాహ్మ‌ణుల‌ను చేయ‌నివ్వాల‌ని ఆయ‌న అన్నారు. అలా కాక‌పోతే దేశాన్ని అప‌రిశుభ్రంగానే ఉండ‌నివ్వాల‌ని ఐల‌య్య అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన ఇటీవ‌ల విడుద‌లైన ”వై అయామ్ హిందూ” అనే పుస్త‌కంపై విమ‌ర్శ‌లు చేశారు. ఆ పుస్త‌క ర‌చ‌యిత శ‌శిథ‌రూర్‌కు భార‌త‌దేశం గురించి అస్సలేమీ తెలియ‌ద‌ని ఆరోపించారు. థ‌రూర్ రాసిన పుస్త‌కంలో ఒక్క శూద్రుడి క్యారెక్ట‌ర్ కూడ లేద‌ని ఆయ‌న అన్నారు.

Tags:    

Similar News