బివేర్ ఆఫ్ సీబీఐ అండ్ ఈడీ బోర్డ్స్...

Update: 2022-11-09 14:30 GMT
ఒక వైపు సీబీఐ. మరో వైపు ఈడీ. ఈ రెండూ కూడా పటిష్టమైన వ్యవస్థలు. దేశంలో అత్యున్నత దర్యాప్తునకు  ప్రతీకలు. ఎవరైనా  విచారణ గట్టిగా జరగాలీ అంటే సీబీఐ ఈడీల గురించి డిమాండ్ చేస్తారు. చాలా కాలం క్రితం వరకూ ఈ రెండు వ్యవస్థల గురించి సామాన్య జనాలకు తెలిసింది బహు తక్కువ. చాలా కీలకమైన కేసులలోనే ఈ రెండు సంస్థలు తలదూర్చేవి. అంటే ఈ సంస్థలు చేపట్టిన కేసులు టాప్ లెవెల్ లో ఉన్న వారి మీదనే గురి పెట్టేవి.

సీబీఐ విచారణకు ఆదేశించారు అంటే ఆ కేసు మీద ఆసక్తి కూడా ఉండేది. నిజానికి మనకు ఉన్న దర్యాప్తు సంస్థలను వేటినీ తక్కువ చేసి చూడకూడదు. రాష్ట్రాల  చేతులలో ఉండే సీఐడీ వ్యవస్థ కూడా చాలా గొప్పది. తీగ లాగి డొంకను మొత్తం తీయగలిదేది. అంటే రాష్ట్ర స్థాయిలో సీఐడీ వ్యవస్థ ఉన్నట్లుగానే దేశ స్థాయిలో సీబీఐ వంటి వ్యవస్థలు ఉన్నాయి.

రాష్ట్రాలలో ఉన్న పోలీస్ వ్యవస్థలు చేపట్టినా ఒక కొలిక్కి రాని కేసులు అందులో అత్యధిక పలుకుబడి కలిగిన వ్యక్తులు కనుక వాటిలో ఉండి ఉంటే వాటి పని పట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగలోకి దిగడం జరిగేది. అయితే ఇది అంతా పాత ముచ్చట అయిపోయింది. ఇపుడు చూస్తే సీబీఐ ఇందుగలడు అందు లేడు అన్నట్లుగా ముందుకు దూసుకుని వస్తోంది.

ఒకనాడు ఫలానా  వారి మీద సీబీఐ దాడులు జరిగాయి అంటే మునుపటి రోజులలో  ఉన్న ఉత్కంఠ ఆసక్తి ఇపుడు తగ్గిపోవడానికి కారణం దాదాపుగా ప్రతీ వారి మీద ఏదో సందర్భంలో సీబీఐ దాడులు జరుగుతున్నాయి. ఆ వెంటేనే ఈడీ దాడులు కూడా చేస్తున్నారు.వీటి వల్ల అదనపు ప్రయోజనం ఏమిటి. కొత్తగా కేసులలో లోతులు చూసి అసలు నిజాలు బయటకు వస్తున్నాయా అంటే అది కూడా నిరాశగానే ఉంటొంది.

నిజానికి చూస్తే సీబీఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ చేపట్టే కేసులలో ఎక్కువ శాతం ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి అనే  చెబుతారు. ఇక దీర్ఘకాలం కేసులు కొనసాగడం తుది ఫలితం తేలకపోవడం ఒక విమర్శగానే ఉంటోంది. ముందే చెప్పుకున్నట్లుగా ఇపుడు ప్రతీ దానికీ సీబీఐ కేసులు పడుతున్నాయి.

వారి మీద వీరు వీరి మీద వారు సీబీఐ విచారణ కావాలని కోరుతూంటే వారూ వీరూ ఎందుకు మాకు అందరూ సమానమే అని కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ సీబీఐ తో కలసి ఈడీని తోడుగా పంపిస్తోంది అని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ప్రతీసారి చెప్పే విషయం ఇచ్చే అందమైన నినదం డబుల్ ఇంజన్ అని. దాని సంగతి ఏమో కానీ డబుల్ ఇంజన్ అంటే మాత్రం ఈడీ సీబీఐలే అన్నట్లుగానే అంతా చెబుతున్నారు. అలాగే అర్ధం చేసుకుంటున్నారు.

ఆఖరుకు ప్రతీ చిన్న విషయం మీద సీబీఐ దాడులు అంటే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారా అన్న చర్చ అయితే మొదలైంది. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పెడ ధోరణి అధికమైందని అంటున్నారు.

దీంతో ఇపుడు అంతా సర్కార్ వారి పాట లో మాదిరిగా ప్రతీ వారూ  బీవేర్ ఆఫ్ సీబీఐ ఈడీ అని బోర్డులు పెట్టుకోవాల్సి వస్తోందని సెటైర్లు కూడా పడుతున్నాయి. మా దగ్గరకు ఈ రెండు సంస్థలకు ప్రవేశం లేదు అని కూడా బోర్డులు పెట్టుకోవాల్సి వచ్చినా రావచ్చు అని అంటున్నారు.

ఏది ఏమైన మనకున్న వ్యవస్థలు పదునైన కత్తులు. వాటి పదునిని అలాగే వాడాలి.వాటి శక్తిని అలాగే ఉంచాలి. వాటిని స్వప్రయోజనాల కోసమే, రాజకీయ అవసరాల కోసమో వాడుకుంటూ పోతే రేపటి రోజున పెద్ద కేసులకు, ఇంతకంటే కఠిన మైన నేరాలకు దేశంలో  ఏ దర్యాప్తు ఏజెన్సీ వచ్చి విచారణ చేపడుతుంది అన్నది కూడా అంతా ఆలోచించాలి. అందువల్ల లోకల్ ఏజెన్సీలను పటిష్టం చేస్తూ వాటి విశ్వాసం పెంచుతూ వాటి పవర్స్ ని కాపాడుతూ వేటికవే సాటి అన్నట్లుగా ఉంచాలి. అలాగే చూపాలి. అది  ఏలుతున్న వారు చేయాల్సిన అతి ముఖ్యమైన బాధ్యత.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News