బూస్టర్ డోస్ కు సంబంధించి భారత్ బయోటెక్ కీలక అడుగు

Update: 2021-12-21 04:29 GMT
హడలెత్తించిన మాయదారి మహమ్మారి కరోనాకు చెక్ పెట్టే ప్రయత్నంలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటక్ కొవాగ్జిన్ టీకాను సిద్ధం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సంస్థ తాజాగా బూస్టర్ డోసు దిశగా కీలక అడుగు వేసింది. తాను తయారు చేసిన ముక్కు టీకాను బూస్టర్ డోసుగా ఇవ్వటానికి సంబంధించి ఫేజ్ 3 ట్రయల్స్ కు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి కోరింది. ఈ ట్రయల్స్ లో టీకా సురక్షితమని తేలితే.. ఇప్పటికే కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోసుగా ముక్కు టీకా ఇస్తారు.

ఇంతకాలం కొవాగ్జిన్ టీకా షెల్ఫ్ లైఫ్ ను తొమ్మిది నెలలుగా ఉండేది. దాన్ని పన్నెండు నెలలకు పొడిగిస్తూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. తాజాగా ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో బూస్టర్ డోసు మీద చర్చ అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి వేళ.. బూస్టర్ డోసుగా ముక్కు వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు భారత్ బయోటెక్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

ఒకవేళ.. ట్రయల్స్ కు కేంద్రం అనుమతులు ఇస్తే.. బూస్టర్ డోసు విషయంలో మరో ముందడుగు పడుతుంది. ట్రయల్స్ సురక్షితమని తేలితే.. బూస్టర్ డోసు మార్కెట్లోకి వచ్చేస్తుంది. అయితే.. దీనికి తక్కువలో తక్కువ ఆర్నెల్ల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. మరి.. భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతులకు సంబంధించిన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే.. కొవాగ్జిన్ కు 28 రోజుల మల్టీ డోస్ వయల్ పాలసీ అనుమతి కూడా వచ్చింది. అంటే.. 20 డోసులు ఉండే టీకా వయల్ ను ఒకసారి తెరిచిన తర్వాత 20 మందికి ఇవ్వొచ్చు. కానీ.. అంతమంది ఇవ్వటానికి అవకాశం లేకుంటే.. ఇప్పటివరకు దాన్ని పడేయాల్సి ఉంది. కానీ.. ఈ మధ్యనే వచ్చిన అనుమతితో వయల్ ను తెరిచిన తర్వాత 20 మంది లేకున్నా.. దాన్ని 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి.. తర్వాతి రోజు ఇవ్వొచ్చు. అలా దీన్ని 28 రోజుల పాటు దాచి ఉంచొచ్చు. ఈ సదుపాయం వల్ల విలువైన వ్యాక్సిన్ వేస్టు కాకుండా ఉంటుంది.



Tags:    

Similar News