కార్పొరేట్ కంపెనీకి ఎర్ర‌కోట...కొత్త చ‌ర్చ‌

Update: 2018-04-29 04:25 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రో వివాదం మొద‌లైంది. ప్రముఖ చారిత్రక కట్టడం ఎర్రకోట రూపంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎర్ర‌కోట‌ నిర్వహణ బాధ్యతను దాల్మియా భారత్ గ్రూప్ దక్కించుకుంది. ఐదేళ్ల‌ పాటు ఎర్రకోట పునరుద్ధరణ - మరమ్మతు - నిర్వహణ బాధ్యతను ఆ కంపెనీ చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక - పర్యాటకశాఖ దాల్మియా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.  అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ట్విటర్‌ లో ఓ పోస్టు పెట్టి పోలింగ్ నిర్వహించింది. చారిత్రక కట్టడాన్ని కార్పొరేట్ సంస్థకు అప్పగించిన బీజేపీ ప్రభుత్వం.. త్వరలో తమ ప్రభుత్వ నిర్వహణను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదిహేడో శతాబ్దంలో ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోట నిర్వహణ బాధ్యతను ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ఇదే ప్రథమం. రూ. 25 కోట్లకు దాల్మియా గ్రూప్ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకున్నది. జీఎంఆర్ - ఇండిగో ఎయిర్‌ లైన్స్ వంటి సంస్థలు పోటీపడ్డప్పటికీ చివరికి దాల్మియా గ్రూప్‌ కే ఈ అవకాశం వచ్చింది. ఐదేండ్ల పాటు ఎర్రకోట నిర్వహణ బాధ్యతను చేపట్టే దాల్మియా సంస్థ అక్కడ తాగునీటి వసతి - ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనుంది. సందర్శకుల కోసం ఉచిత వైఫై - ఆధునాతన మరుగుదొడ్లు - టిఫిన్‌ సెంటర్లు - అన్ని భాషల గైడ్లను అక్కడ ఏర్పాటు చేయనుంది.  సాంస్కృతిక - పర్యాటకశాఖ అనుమతులు పొందిన అనంతరం సందర్శకుల నుంచి కొంతమొత్తాన్ని వసూలు చేయనున్నారు. కుతుబ్‌ మినార్ - జంతర్‌ మంతర్ - ఒడిశాలోని సూర్యదేవాలయం తదితర ప్రదేశాలను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు గత ఏడాది ఏడు కంపెనీలకు కేంద్ర సాంస్కృతిక - పర్యాటక శాఖ లేఖలు రాసింది. అందులోభాగంగా దాల్మియా గ్రూపు సొంతం చేసుకుంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ చరిత్రకారుడు - రచయిత విలియం డార్లింప్లే కూడా తప్పు పట్టారు. ఒక కార్పొరేట్ సంస్థకు ఇటువంటి కీలక బాధ్యతను అప్పగించేటప్పుడు తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఆరోపణలను కేంద్రమంత్రి మహేశ్‌ కుమార్ తిప్పికొట్టారు. ఎర్రకోట నిర్వహణ బాధ్యతను దాల్మియా సంస్థకు అప్పగించంతో బీజేపీకి ఎటువంటి స్వప్రయోజనం లేదని పేర్కొన్నారు. ఎర్రకోటలో మౌలిక వసతుల కల్పనకు దాల్మియా సంస్థతో ఒప్పందాన్ని చేసుకున్నామని - ఇదంతా పార‌దర్శ‌కంగానే జ‌రిగింద‌ని అన్నారు.
Tags:    

Similar News