గంగుల ఎంట్రీకి అఖిల‌ప్రియ రియాక్ష‌న్ వ‌చ్చేసింది

Update: 2017-08-17 07:40 GMT
కోరి క‌ష్టాలు తెచ్చుకోవ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. ఒకే ఒర‌లో రెండు క‌త్తుల్ని ఉంచే ప్రోగ్రాంకు ఈ మ‌ధ్య‌న తెర తీసిన వైనం తెలిసిందే. ఈ విధానంపై అధికార‌ప‌క్షంలోని నేత‌ల మ‌ధ్య కొత్త ర‌చ్చను రేపుతోంది. బాబు తీరుతో ఇప్పుడు పార్టీలో  అసంతృప్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. తాజాగా భూమా ఫ్యామిలీకి ఏ మాత్రం పొస‌గ‌ని గంగుల ప్ర‌తాప‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించ‌టంపై మంత్రి అఖిల‌ప్రియ తీవ్ర అసంతృప్తితో పాటు ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి గ‌తంలో ఎమ్మెల్యేగా.. నంద్యాలకు ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన గంగుల ఫ్యామిలీతో భూమా కుటుంబానికి ఉన్న రాజ‌కీయ వైరం అంద‌రికి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఇష్టాయిష్టాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా గంగుల‌ను పార్టీలోకి ఆహ్వానించిన వైనంపై మంత్రి అఖిల‌ప్రియ గుర్రుగా ఉన్నారు.

అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబును గంగుల ప్ర‌తాప‌రెడ్డి క‌లిశార‌న్న విష‌యాన్ని తెలిసిన వెంట‌నే అఖిల‌ప్రియ షాక్ తిన్న‌ట్లుగా చెబుతున్నారు. ఓవైపు నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో కిందామీదా ప‌డుతున్న ఆమెకు తాజా ప‌రిణామం శ‌రాఘాతంగా మారింద‌ని చెబుతున్నారు. గంగుల‌కు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చార‌న్న విష‌యం తెలిసిన వెంట‌నే.. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మ‌ధ్య‌లో వ‌దిలేసి ముఖ్య‌నేత‌ల‌తో మీటింగ్ పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ  సంద‌ర్భంగా త‌మ‌ను ప‌క్క‌న పెట్టిన బాబుపై భూమా వ‌ర్గం ర‌గిలిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. గంగుల ఎంట్రీపై త‌న‌కు ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై ఆమె ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గంగుల ఎంట్రీ టీడీపీకి ఏ మాత్రం క‌లిసి రాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే భూమా అఖిల‌ప్రియ కూడా తీవ్ర అసంతృప్తితో ఉండ‌టం నంద్యాల ఉప ఎన్నిక తుది ఫ‌లితం మీద ప్ర‌భావం చూపుతుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News