భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్!

Update: 2020-11-10 16:41 GMT
అమెరికా ఎన్నికల్లో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకున్న ట్రంప్ కలలు ఆవిరైయ్యాయి. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. నాలుగేళ్ల ట్రంప్‌ పాలనతో విసుగుచెందిన అమెరికన్స్‌.. బైడెన్‌కు పట్టంకట్టారు. విమర్శలు, వివాదాలతో కాలంగడిపిన అధ్యక్షుడిని కోలుకోని దెబ్బకొట్టారు. మొదట నుంచీ విజయంపై అత్యాశ పడ్డ ట్రంప్‌కు చివరికి నిరాశే ఎదురైంది. అయితే , ఎన్నికల్లో విజయం సాధించగానే , అమెరికా అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకోకముందే కరోనా నియంత్రణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి , కరోనా మహమ్మారి నియంత్రణ పై మాత్రమే పనిచేసేలా నియమించారు. బైడెన్‌ దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి నేతృత్వం వహించే అవకాశం భారతీయ అమెరికన్‌ డాక్టర్‌కు లభించింది.

ఈ కరోనా టాస్క్‌ ఫోర్స్‌ కు నియమించిన ముగ్గురు అధ్యక్షుల్లో భారతీయ అమెరికన్‌ వైద్యుడు డాక్టర్‌ వివేక్‌ మూర్తి ఒకరు. డాక్టర్‌ డేవిడ్‌ కెస్లర్, డాక్టర్‌ మార్సెల్లా నునెజ్‌ స్మిత్‌ కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు. కరోనాను కట్టడి చేసే సమగ్ర కార్యాచరణను ఈ టాస్క్‌ ఫోర్స్‌ బైడెన్‌కు అందిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సలహా బృందంలో భారతీయ అమెరికన్‌ అతుల్‌ గావండే, లూసియానా బోరియొ, రిక్‌ బ్రైట్‌ ఉన్నారు. డాక్టర్‌ వివేక్‌ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికా 19వ సర్జన్‌ జనరల్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం అమెరికాలో రోజు లక్షకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే ఇప్పటికే అమెరికాలో కోటికి పైగా కేసులు నమోదు అయ్యాయి.
Tags:    

Similar News