కౌన్ బనేగా కరోడ్‌ పతి లో వైసీపీ ఎంపీ పేరు..సీఎం జగన్ గురించి చెప్పిన అమితాబ్!

Update: 2020-10-01 09:50 GMT
కౌన్ బనేగా కరోడ్‌ పతి .. ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ కౌన్ బనేగా కరోడ్‌ పతి 20 ఏళ్లుగా విరామం అన్నది లేకుండా కొనసాగుతూ వస్తోంది. ఓ ప్రైవేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఈ షోను నిర్వహిస్తోంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త కొత్త ప్రశ్నలను సంధిస్తూ వైవిధ్యాన్ని చూపిస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.. హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌ పతి.. ప్రజల్లో జనాదరణను పొందింది. పక్కా.. లాక్ కియాజాయ్, తాళా లగాదియా జాయ్..కంప్యూటర్ జీ, కంప్యూటర్ మహాశయ్.. అనే బిగ్ బీ డైలాగులు నిత్యం వాడుతుంటారు.

ఇకపోతే , ఈ షోలో తరచూ రాజకీయాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రశ్నలను కూడా కంటెస్టెంట్ల ముందు ఉంచుతుంటారు. ఇందులో భగంగా..రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రశ్నను సంధించారు అమితాబ్ బచ్చన్. ఈ ప్రశ్నకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించే క్రమంలో ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించీ ప్రస్తావించారు. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పై ప్రశ్నను ఇచ్చారు. 2019లో పీ సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేదే ప్రశ్న. దానికి ఆప్షన్లుగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఇచ్చారు. కంటెస్టెంట్ సోనూ కుమార్ గుప్తాకు ఈ ప్రశ్నను వేశారు అమితాబ్ బచ్చన్. అది 25 లక్షల రూపాయల విలువ చేసే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే 25 లక్షల రూపాయలను గెలుచుకునేవాడు సోనూ కుమార్.

అయితే  సమాధానం చెప్పలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్ అని తాను భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడే తప్ప చెప్పలేకపోయాడు. అప్పటికే అతను 12,50,000 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. తనకు ఉన్న నాలుగు అవకాశాలనూ వినియోగించుకున్నాడు. అవకాశాలేవీ లేకపోవడంతో క్విట్ అయ్యాడు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్.. వైఎస్ జగన్, వైసీపీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి వివరించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. వైఎస్ జగన్ తన కేబినెట్‌లో అయిదు మంది ఉప ముఖ్యమంత్రులను నియమించారని వివరించారు. ఆ అయిదుమందిలో పీ సుభాష్ చంద్రబోస్ ఒకరు అని, ఆయన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించారని తెలిపారు.
Tags:    

Similar News