బిల్ గేట్స్ టాప్‌..ట్రంప్ బ్యాక్ సీట్లోకి వెళ్లాడు

Update: 2017-03-21 11:25 GMT
మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ మ‌ళ్లీ ఫోర్బ్స్ సంప‌న్నుల జాబితాలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ ఏడాది కూడా బిల్ గేట్స్ బిలియ‌నీర్ల జాబితాలో మొద‌ట స్థానాన్ని ఆక్ర‌మించారు. మొత్తం రెండు వేల కుబేరుల జాబితాలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ 200 స్థానాల‌కు ప‌డిపోయారు. గేట్స్ ఆస్తుల విలువ సుమారు 86 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని ఫోర్బ్స్ అంచ‌నా వేసింది. వ‌రుస‌గా నాలుగో ఏడాది గేట్స్ అగ్ర‌స్థానంలో నిలిచారు. గ‌త 23 ఏళ్ల‌లో బిల్ గేట్స్ 18 సార్లు టాప్ ప్లేస్‌లో నిలువడం విశేషం.

టాప్ 10 కుబేరుల్లో ఎక్కువ శాతం అమెరికా వ్య‌క్తులే ఉన్నారు. గేట్స్ త‌ర్వాత స్థానంలో బ‌ర్క్‌షైర్ హాత్‌వే చీఫ్ వారెన్ బ‌ఫెట్ నిలిచారు. బ‌ఫెట్ ఆస్తులు సుమారు 75.6 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఆస్తుల్ని దానం చేస్తున్న‌ట్లు బ‌ఫెట్ ప్ర‌క‌టించినా ఫోర్బ్స్ జాబితాలో మాత్రం ఆయ‌న ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు. అమెజాన్ ఫౌండ‌ర్ జెఫ్ బెజోస్‌ మూడ‌వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఎక్కువ లాభాలు సాధించిన వ్య‌క్తుల్లో జెఫ్ బేజోస్ మొద‌టి ప్లేస్‌లో నిలిచారు. ఆయ‌న ఆస్తులు 27.6 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 72.8 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ అయిద‌వ స్థానంలో ఉన్నారు. ఒరాకిల్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు లారీ ఎల్లిస‌న్ ఏడ‌వ స్థానంలో ఉన్నారు. బిలియ‌నీర్ల‌లో మొత్తం 183 మంది టెక్నాల‌జీ రంగానికి చెందిన‌వాళ్లే ఉన్నారు. వాళ్ల ఆస్తులు మొత్తం క‌లిపి ట్రిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ ఏడాది బిలియ‌నీర్ల సంఖ్య 13 శాతం పెరిగిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొన్న‌ది. గ‌త 31 ఏళ్ల‌లో ప్ర‌స్తుత పెరుగుద‌లే అధిక‌మ‌ని మ్యాగ్జిన్ వెల్ల‌డించింది. ఫోర్బ్స్ లిస్టులో అమెరికాకు చెందిన 565 మంది, చైనాకు చెందిన 319 మంది బిలియ‌నీర్లు ఉన్నారు.

కాగా, ఫోర్బ్స్ జాబితాలో ట్రంప్ గ్రాఫ్ ప‌డిపోయింది. ఆ లిస్టులో ఆయ‌న 544వ స్థానంలో ఉన్నారు. గ‌తంతో పోలిస్తే 220 స్థానాలు ప‌డిపోయారు. ప్ర‌స్తుతం ట్రంప్ ఆస్తుల విలువ 3.5 బిలియ‌న్ల డాల‌ర్లు. మ‌న్‌హ‌ట‌న్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప‌డిపోవ‌డం వ‌ల్లే ట్రంప్ ఆస్తులు త‌గ్గిన‌ట్లు ఫోర్బ్స్ అంచ‌నా వేసింది. దీంతోపాటుగా ఇటీవ‌ల అధ్య‌క్ష ఎన్నిక‌ల కోసం కూడా ట్రంప్ భారీగా ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల ఆయ‌న ఆస్తులు త‌గ్గాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News