ఆ విషయంలో స్వామి గెలిచినట్లే

Update: 2015-12-19 12:11 GMT
అమ్మ తలుచుకుంటే చాలు.. ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోతారు. అమ్మ అనుకుంటే చాలు.. భారతదేశంలో ఎవరు ఏదైనా అయ్యే అవకాశం ఉంది. అలాంటి అమ్మ.. కోర్టుకు వెళ్లటం అనేది ఉంటుందా? అవసరమైతే కోర్టునే తన దగ్గరకు పిలిపించుకుంటుందన్న పిచ్చి నమ్మకంతో ఉంటారు చాలామంది కాంగ్రెస్ వీరాభిమానులు. అయితే.. భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా బలమైందని.. అధికారం అంతకు మించిన బలమైనది.. దాని ధాటికి ఏమైనా జరిగిపోతుందన్న విషయం మరోసారి నిరూపితమైంది.

వీటన్నింటికి మించి.. ఎవరికి సాధ్యం కానిది.. దేశంలో ఏ రాజకీయ నేత కూడా ఊహించని పనుల్ని చేయగలగిన సత్తా బీజేపీ నేత సుబ్రమణ్య స్వామికే దక్కుతుంది. తమిళుడిగా సుపరిచితమైన ఆయన కానీ దృష్టి పెడితే.. ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి. కేంద్రమంత్రుల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తును మార్చేసే సత్తా సుబ్రమణ్య స్వామి సొంతం. మచ్చుకు ఆయన టేకప్ చేసిన విషయాల్నే తీసుకుంటే.. భోఫోర్స్ కుంభకోణం కావొచ్చే.. దేశం మొత్తాన్నికదిలించేసిన 2జీ కుంభకోణం కావొచ్చు.. బొగ్గు కుంభకోణం కావొచ్చు.. ఇలా స్కామ్ లు ఏం జరిగినా.. అది బయటకు వచ్చిందంటే అది సుబ్రమణ్యస్వామి పుణ్యమే.

ఆయనే తాజాగా అమ్మకొడుకుల్ని కోర్టుకు రప్పించగలిగారు. సోనియా.. రాహుల్ లాంటి నేతలు న్యాయస్థానాలకు అతీతం లాంటి మాటల్ని కొట్టిపారేస్తూ.. భారత్ లో ప్రజాస్వామ్యం ఎంతలా పని చేస్తుందో చెప్పటానికి తాజాగా అమ్మాకొడుకులు కోర్టుకు రావటమే నిదర్శనంగా చెప్పొచ్చు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన చీకటి కోణాల్ని.. వందలాదికోట్ల రూపాయిల కోసం కక్కుర్తి పడిన గాంధీ ఫ్యామిలీని కోర్టు మెట్లు ఎక్కించిన మొనగాడు సుబ్రమణ్య స్వామిగానే చెప్పాలి.

ఇప్పటికిప్పుడు ఈ కేసు వెనుకాల బీజేపీ.. మోడీ ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు ఆరోపించినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకురావటమే కాదు.. న్యాయస్థానాల్లో స్వామి పోరాడుతున్నారు. కాకపోతే.. ఇవాళ కాలం.. ఖర్మం కలిసి వచ్చిందంతే. ఏది ఏమైనా అమ్మాకొడుకుల్ని కోర్టు గడప తొక్కించటంలో స్వామి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. భవిష్యత్తులో ఈ కేసులో సోనియా.. రాహుల్ బయటపడతారా? లేదా? అన్నది తర్వాతి అంశం. కానీ.. భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని.. న్యాయం ఎవరి విషయంలోనైనా ఒకేలా వ్యవహరిస్తుందని.. కాకుంటే ఒకరోజు అటూఇటూ అన్న విషయం తాజా ఉదంతంతో స్పష్టమైందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News