గాలంతో పార్టీలు సిద్ధం!!

Update: 2018-09-07 07:23 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తుకు వెళ్లడం ఖాయం చేసింది. అంతే కాదు... ఎవురూ ఊహించని విధంగా 105 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దూకుడుకు ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయి. ముందస్తు ఊహించినదే అయినా అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడడంతో ప్రతిపక్ష పార్టీల నోట మాట రాకుండా పోయింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్లు రాక భంగపడ్డ నాయకులు ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. గడచిన నాలుగేళ్లుగా టికెట్ వస్తుందని ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డవారు చాలామందే ఉన్నారు. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా తలో దారి చూసుకునే పనిలో పడ్డారని సమాచారం. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో భంగపడ్డ వారిని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.

తెరాసలో టికెట్ రాని వారిలో కొందరు నాయకులకు వారివారి నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. అలాంటి వారిని తమ వైపు ఆకర్షించి వారిని పోటీలో దింపాలని భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ముందుగా పార్టీలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న వారు ఎవరు... తెలంగాణ రాష్ట్ర సమితిలో వారి పాత్ర ఏమిటి... వారిని  ఆకర్షించాలంటే ఏం చేయాలి వంటి అంశాలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇలాంటి నాయకులను ఆకర్షించి వారిని పార్టీలోకి తీసుకొచ్చే పనిని ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ గాలానికి ఎవరు చిక్కుతారా అని ఎదురుచూస్తోంది.

అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ రాని వారిని తీసుకునే సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని - లేకపోతే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ముందుగా ఎలాంటి హామీలు ఇవ్వకూడదని - పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి ఆకర్షించాలని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకుడు కుంతియాతో కూడా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీకి ఎలాంటి నష్టం కలుగకుండా - గులాబీ కండువాను వదిలేసి తమ దగ్గరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం స్ధానిక నాయకులను ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు తెర తీస్తున్నాయి.


Tags:    

Similar News